ఆక్సిజన్ కొరతతో ఆరుగురు కరోనా పేషెంట్లు మృతి
దేశంలో కరోనా విలయం సృష్టిస్తోంది. కరోనా రోగులు హాస్పిటల్స్ కు క్యూ కడుతుండడంతో సదుపాయాల లేమి మరింత ఇబ్బందిగా మారింది.

Mp Shocker
MP shocker దేశంలో కరోనా విలయం సృష్టిస్తోంది. కరోనా రోగులు హాస్పిటల్స్ కు క్యూ కడుతుండడంతో సదుపాయాల లేమి మరింత ఇబ్బందిగా మారింది. పలు చోట్ల ఆక్సిజన్ అందక కరోనా రోగులు మృత్యువాతపడుతున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్‌లోని షాదోల్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో ఆక్సిజన్ కొరతతో ఆరుగురు కరోనా రోగులు మృతి చెందారు. ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతున్న ఆరుగురు కరోనా రోగులు ఆక్సిజన్ సరిగ్గా అందక ప్రాణాలు కోల్పోయినట్లు ఫెసిలిటీస్ డీన్ డాక్టర్ మిలింద్ షిరాల్కర్ తెలిపారు. ఐసీయూలో మొత్తం 62 మంది చికిత్స పొందుతున్నారని..ఆక్సిజన్ సరఫరా తగ్గడంతో(లో ప్రెజర్ ఆక్సిజన్)శనివారం అర్థరాత్రి నుంచి ఒక్కొక్కరిగా ఆరుగురు కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారని మిలింద్ పేర్కొన్నారు. మిగిలిన రోగులు క్షేమంగా ఉన్నారని ఆయన చెప్పారు. శనివారం సాయంత్రానికే ఆక్సిజన్ సరఫరా ఆగిపోయిందని.. అప్పటి నుంచి ఆక్సిజన్ కోసం ఫోన్లు చేస్తున్నా స్పందించలేదని చెప్పారు. రాత్రి వరకూ ఆక్సిజన్ సరఫరా వాహనం రాలేదని..దీంతో ఆక్సిజన్ సరిగ్గా అందక ఆరుగురు రోగులు చనిపోయి ఉంటారని ఆయన చెప్పారు. ఈ సంఘటన ఎలా జరిగిందనే విషయం తేల్చేందుకు నిపుణుల బృందం రానుందని ఆయన తెలిపారు.
హాస్పిటల్ లో 10 కిలో లీటర్ల ఆక్సిజన్ ప్లాంట్ ఉందని..లిక్విడ్ ఆక్సిజన్ బయటి నుంచి కొనుగోలు చేస్తున్నట్లు మిలింద్ చెప్పారు. లిక్విడ్ ఆక్సిజన్ సరఫరాల అయిపోవడంతోనే ఘటన జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్ తీవ్రంగా స్పందించారు. షాదోల్ ఘటన బాధాకరమన్న కమల్ నాథ్..భోపాల్,ఇండోర్,ఉజ్జయిన్‌లో ఇలాంటి ఘటనలు జరిగినా ప్రభుత్వం మేల్కోకపోవడం దారుణమని మండిపడ్డారు. రెమిడెసివిర్, ఆక్సిజన్ పేపర్లపైనే అందుబాటులో ఉన్నాయని..క్షేత్రస్థాయిలో నిజం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలాఉంటే.. మధ్యప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 11,269 కరోనా కేసులు నమోదవగా, 66 మంది మృతిచెందారు. మొత్తంగా ఇప్పటివరకు 4,491 మంది మరణించారు. 3.95 లక్షల మందికి వ్యాధి సోకగా.. వారిలో 3.27 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 63,889 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.