Mumbai Couple : హనీమూన్‌కి వెళ్లి అరెస్ట్ అయిన ముంబై జంట.. రెండేళ్ల జైలుశిక్ష తర్వాత బిడ్డతో సహా ఇండియాకి
సెకండ్ హనీమూన్ కోసం ఖతార్ వెళ్లి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ముంబైకి చెందిన ఓ జంట.. రెండేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి రానుంది. ఇప్పుడు వారు ఇద్దరు కాదు, ముగ్గురు. అరెస్ట్ అయ్యే సమయానికి ఆమె ప్రెగ్నెంట్. జైల్లోనే ఆడబిడ్డను ప్రసవించింది.

Mumbai Couple
Mumbai couple acquitted in drug case in Qatar : సెకండ్ హనీమూన్ కోసం ఖతార్ వెళ్లి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ముంబైకి చెందిన ఓ జంట.. రెండేళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి రానుంది. ఇప్పుడు వారు ఇద్దరు కాదు, ముగ్గురు. అరెస్ట్ అయ్యే సమయానికి ఆమె ప్రెగ్నెంట్. జైల్లోనే ఆడబిడ్డను ప్రసవించింది.
అతడి పేరు మహమ్మద్ షరీక్. ఆమె పేరు ఖురేషి. భార్యాభర్తలు. సెకండ్ హనీమూన్ కోసం 2019లో ఖతార్ కి వెళ్లారు. అయితే ఊహించని ఘటన జరిగింది. డ్రగ్స్ అక్రమ రవాణ కేసులో ఖతార్ పోలీసులు దంపతులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోర్టు వారికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. హమద్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో సిబ్బంది లగేజీ చెక్ చేస్తుండగా.. దంపతులకు చెందిన లగేజీలో 4.1కిలోల హషిష్(మత్తు కలిగించే పదార్ధం) ఉంది.
అయితే అది డ్రగ్ అని, దాన్ని తీసుకురావడం చట్టరిత్యా నేరం అనే విషయం దంపతులకు తెలీదు. అందులో టొబాకో(పొగాకు) ఉంది. దాన్ని షరీక్ అత్తగారు ఇచ్చారు. ఖతార్ లో తన ఫ్రెండ్ కి ఇవ్వాలని చెప్పారు. ఇలా ఏ తప్పు చేయకుండానే వారు కటకటాల పాలయ్యారు. ఖతార్ చట్టాల ప్రకారం పొగాకు.. నిషేధిత డ్రగ్స్ తో సమానం. పొగాకు కలిగి ఉండటం, రవాణ చేయటం చట్టరిత్యా నేరం. ఇందుకు కఠినమైన శిక్షలు విధిస్తారు.
తమకు ఏ పాపం తెలీదని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరించారు. కోర్టు వారికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. పోలీసుల వారిని జైలుకి తరలించారు. ఆ సమయంలో ఖురేషి గర్భవతి. కొన్ని రోజులకు ఆమె జైల్లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
కాగా ఈ కేసులో దంపతులు అమాయకులు, వారికి ఏ పాపం తెలీదని విచారణలో తేలింది. వాస్తవానికి ఇదంతా చేసింది మహమ్మద్ అత్త అని పోలీసులు నిర్ధారించారు. ఆమె.. వారిని పావుగా వాడుకుందని, పొగాకుని తన స్నేహితుడి దగ్గరికి చేర్చేందుకు హనీమూన్ పేరుతో వారిని ఖతార్ పంపిందని తేలింది. దీంతో కోర్టు వారిని నిర్దోషులగా తేల్చింది. చివరికి రెండేళ్ల జైలు శిక్ష తర్వాత వారికి విముక్తి లభించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు దంపతులను జైలు నుంచి విడుదల చేశారు. ఇప్పుడా జంట స్వదేశానికి బయలుదేరింది. అయితే వారు ఇద్దరు కాదు ముగ్గురు. వారితో పాటు వారి కూతురు కూడా ముంబైకి రానుంది. తమ పిల్లలు ఇంటికి రానున్నారనే వార్తతో మహమ్మద్ తల్లిదండ్రులు ఆనందానికి లోనయ్యారు. తన కొడుకు, కోడలు, మనవరాలికి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాడు.