Mumbai Police issued warning to take strict action on stopping vehicles on Atal Setu
Atal Setu- Police Warning: మనోళ్లు మామూలోళ్లు కాదు. నవీ ముంబైలో సముద్రంపై నిర్మించిన అటల్‌సేతు బ్రిడ్జిని తెగవాడేస్తున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పోలీసులు కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. వాడుకోవడానికే కదా వంతెన కట్టారు.. కేసులేంటని కన్ఫూజ్ అవుతున్నారా? మనోళ్లు వాడుతోంది ప్రయాణాలకు కాదు.. ఫొటోలకు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన అటల్‌సేతు బ్రిడ్జిపై ఫొటోలు, సెల్ఫీల కోసం జనం ఎగబడుతున్నారు. దీంతో ట్రాఫిక్ కు ఆటంకం కలుగుతుండడంతో పోలీసు వార్నింగ్ అలర్ట్ ఇచ్చారు.
దేశంలోనే సముద్రంపై కట్టిన అతిపొడవైన బ్రిడ్జిగా ఘనత సాధించిన అటల్‌సేతును ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. నవీ ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్‌గడ్‌లోని నహవా శేవాను కలుపుతూ ఐదేళ్ల రికార్డు వ్యవధిలో నిర్మించిన ఈ బ్రిడ్జి మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు. ఇందులో 16 కిలోమీటర్లు సముద్రంపైనే ఉంటుంది. భారత ఇంజనీరింగ్ ప్రతిభకు సజీవసాక్ష్యంగా నిలిచిన ఈ వంతెన నిర్మాణానికి 17 వేల 840 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. దీంతో దక్షిణ ముంబై నుంచి నవీ ముంబైకి ట్రాఫిక్ కష్టాల మధ్య రెండు గంటల పాటు ప్రయాణించాల్సిన అవసరం లేకుండా 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. అందుకే అటల్‌సేతును బాహుబలి బ్రిడ్జిగా పేర్కొంటున్నారు.
Also Read: పులితో పరాచకాలు వద్దు బాబాయ్..! వీడియో వైరల్
అటల్‌సేతు అలా ప్రారంభమైందో, లేదో జనాలు ఫొటోలు కోసం ఎగబడుతున్నారు. వంతెనపై ఎక్కడబడితే అక్కడ వెహికిల్స్ ఆపేసి ఫొటోలు, సెల్ఫీలు దిగుతున్నారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీనిపై స్పందించిన ముంబై ట్రాఫిక్ పోలీసులు.. అటల్‌సేతు పిక్నిక్ స్పాట్ కాదని, వెహికిల్స్ ఆపేసి ఫొటోల దిగితే కేసులు ఎదుర్కొవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు అధికారిక ట్విటర్ పేజీలో ట్వీట్ పెట్టారు. పోలీసుల నిర్ణయాన్ని సమర్థిస్తూ నెటిజనులు పోస్టులు పెడుతున్నారు. నిబంధనలకు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించాలని కోరుతున్నారు. బ్రిడ్జిపై చెత్తా చెదారం వేసే వారిపైనా నిఘా పెట్టాలని సూచించారు.
Also Read: ఫాస్టాగ్ అలర్ట్.. వెంటనే ఈ పని చేయండి, లేదంటే జనవరి 31 తర్వాత పని చేయదు
అనుమతి లేని వాహనాలు కూడా బ్రిడ్జిపైకి వస్తున్నాయని, వీటిని నియంత్రించాలని ట్రాఫిక్ పోలీసులను ముంబై వాసులు కోరుతున్నారు. కాగా, ద్విచక్ర వాహనాలు, ఆటో రిక్షాలు, ట్రాక్టర్లు, జంతువులతో నడిచే వాహనాలు, నెమ్మదిగా వెళ్లే వాహనాలను వంతెనపైకి అనుమతి లేదు.