Electric Bike Safety Measures : ఈ-బైక్‌లు బాంబుల్లా పేలకుండా ఉండాలంటే.. తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సి ప్రమాణాలు

ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీలు బాంబుల్లాగా ఎందుకు మారుతున్నాయి? అసలు ఈ-బైక్ లు పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పాటించాల్సిన ప్రమాణాలు ఏంటి?

Electric Bike Safety Measures : ఈ-బైక్‌లు బాంబుల్లా పేలకుండా ఉండాలంటే.. తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సి ప్రమాణాలు

Updated On : September 14, 2022 / 12:15 AM IST

Electric Bike Safety Measures : లేటెస్ట్ టెక్నాలజీతో మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇటీవల కాలంలో బాంబుల్లా మారుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలు పేలి వాహనదారులు చనిపోయిన ఘటనలు చాలా చూశాం. కానీ, ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూమ్ లో బ్యాటరీలు పేలి 8మంది ప్రాణాలు కోల్పోవడం ఈ మధ్య కాలంలో అత్యంత విషాదం. అసలు ఎందుకిలా జరుగుతోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీలు బాంబుల్లాగా ఎందుకు మారుతున్నాయి?

సికింద్రాబాద్ రూబీ హోటల్ లోని రూబీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ షో రూమ్ లో బ్యాటరీలు పేలడంతో మళ్లీ బ్యాటరీల భద్రతపై చర్చ ప్రారంభమైంది. బ్యాటరీలను రాత్రి పూట చార్జింగ్ పెట్టడం వల్లే ప్రమాదం జరిగింది? లేక బిల్డింగ్ లో షార్ట్ సర్క్యూట్ జరిగిందా? అన్నది తేలాల్సి ఉంది. అయినప్పటికీ ఈ స్కూటర్ బ్యాటరీ పేలడం వల్లే ప్రమాదం జరిగుంటే మాత్రం భద్రతా ప్రమాణం గురించి కచ్చితంగా అందరూ చర్చించుకోవాల్సిన విషయమే.

ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో బీఎంఎస్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. బీఎంఎస్ అంటే బ్యాటరీ మేనేజ్ మెంట్ సిస్టమ్. ఇది బ్యాటరీలోని అన్ని విభాగాలకు అనుసంధానించబడి ఉంటుంది. ఓల్టేజ్ హెచ్చుతగ్గులకు అనుగుణంగా కరెంట్ సరఫరా ఎలా ఉంటుందో సూచిస్తుంది. చార్జింగ్, బ్యాటరీ సామర్థ్యంతో పాటు ఇతర పరిమితులను లెక్కించడంలో బీఎంఎస్ సహాయపడుతుంది. అందుకే ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు బీఎంఎస్ కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి.

పెట్రోల్ వెహికల్స్ అంత ఈజీ కాదు ఈవీ వెహికల్స్ ను మెయింటైన్ చేయడం. మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ నుంచి షోరూమ్ కి వచ్చే వరకు ఎలాగైతే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటారో… కొనుగోలుదారులు ఆ తర్వాత కూడా అలాంటి ప్రమాణాలు పాటించాలి. లేకుంటే బ్యాటరీలు బాంబుల్లా పేలతాయి. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు పేలేందుకు ముఖ్య కారణం బ్యాటరీ సెల్స్, మాడ్యూల్స్ లో లోపాలే. బ్యాటరీని జాగ్రత్తగా చార్జింగ్ పెట్టాలి. ఏ మాత్రం అలసత్వం వహించినా బ్యాటరీలు పేలే అవకాశమే ఎక్కువ.

లెడ్ యాసిడ్ బ్యాటరీలతో పోలిస్తే లిథియం ఐయాన్ బ్యాటరీల నాణ్యత ఎక్కువ. ఒక కిలో బరువుండే లిథియం అయాన్ బ్యాటరీలో 150 వాట్ అవర్స్ మేర స్టోరేజీ ఉంటుంది. ఇక లెడ్ యాసిడ్ బ్యాటరీస్ లో అయితే 25 వాట్ అవర్స్ స్టోరేజీ మాత్రమే ఉంటుంది. ఫుల్ చార్జింగ్ కు తక్కువ సమయం తీసుకుంటాయి. ఈ కారణంతో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లలో లిథియం అయాన్ ను వాడుతున్నారు. అయితే ఈ బ్యాటరీస్ లో మెకానిజం కొంత టిపికల్ గా ఉంటుంది. విద్యుత్ సాంద్రత చాలా ఎక్కువ.

వీటిలో బ్యాటరీ నిర్వహణ వ్యవస్థ ద్వారానే బ్యాటరీ ఫుల్ చార్జింగ్ అయ్యిందా? ఇంకా ఎంత బ్యాటరీ చార్జ్ ఉంది? అనే విషయాలు స్మార్ట్ ఫోన్స్ లో తెరపై కనిపిస్తాయి. ఒకవేళ బీఎంఎస్ సరిగా పనిచేయకపోతే బ్యాటరీ 90 నుంచి 100 డిగ్రీల స్థాయిలో వేడెక్కినా హెచ్చరికలు ఉండవని, బ్యాటరీలు పేలే ప్రమాదం ఉంటుందని నిపుణులు సైతం చెబుతున్నారు.

ఓల్టేజ్ లో భారీ హెచ్చు తగ్గుల కారణంగా లిథియం ఐయాన్ బ్యాటరీలు పేలే ప్రమాదం ఉందని వాహనరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఎర్త్ లేకుండా బ్యాటరీ చార్జింగ్ చేస్తే.. వైరింగ్ లోపాల వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదాలు ఉన్నాయి. ఉత్పత్తిదారులు బ్యాటరీలకు టెస్టింగ్ నిర్వహించకపోవడం కూడా ప్రమాదానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఉత్పత్తిదారులు బ్యాటరీలకు టెస్టింగ్ నిర్వహించకుండానే మార్కెట్ లోకి పంపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కూటర్ల ఉత్పత్తిదారులు కూడా.. డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని ఎవరూ పట్టింకోవడం లేదనే విమర్శ కూడా ఉంది.

ఈ బైక్ పేలకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
మొత్తం ఛార్జింగ్ అయిపోయేవరకు వాహనాన్ని వాడొద్దు.
కేసింగ్ దెబ్బతిన్న వాహనాలను ఛార్జింగ్ చేయొద్దు.
వాహనం నడిపిన గంట తర్వాతే ఛార్జింగ్ పెట్టాలి.
మండే స్వభావం ఉన్న వస్తువులకు దూరంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ను పార్క్ చేయాలి.
నీడలోనే బ్యాటరీని ఛార్జింగ్ చేయాలి. ఒరిజినల్ ఛార్జర్ నే వాడాలి.
బీఎంఎస్ సరిగా పనిచేయకపోతే బ్యాటరీ 90-100 డిగ్రీలు వేడెక్కినా తెలియదు.
వైరింగ్ లోపాల వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదాలే ఎక్కువ.
ఈవీలను ఎక్కువసేపు ఎండలో పార్కింగ్ చేయొద్దు.
వోల్టేజ్ హెచ్చు తగ్గులతోనే అసలు సమస్య.