Manipur: నా రాష్ట్రం తగలబడిపోతోంది.. దయచేసి కాపాడండి; మేరీ కోమ్ అభ్యర్థన

మణిపూర్ లో ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, ఎవరూ సురక్షితంగా లేరని బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ ఆవేదన చెందారు.

Manipur: మణిపూర్ రాష్ట్రం రావణకాష్టంగా మారింది. వరుసగా జరుగుతున్న హింసాత్మక ఘటనలతో ఈ ఈశాన్య రాష్ట్రం అల్లకల్లోంగా మారింది. కుకీ, మెయితీ వర్గాల పరస్పర ఘర్షణతో మణిపూర్ రాష్ట్రం అట్టుడికి పోతోంది. అల్లర్లను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జోక్యంతో భారత ఆర్మీ రంగంలోకి దిగింది. హింసాత్మక ఘటనలను నియంత్రించేందుకు మణిపూర్ ప్రభుత్వం 8 జిల్లాల్లో కర్ఫ్యూ విధించి.. మొబైల్ ఇంటర్నెట్ ను నిలిపివేసింది.

శాంతి, సామరస్యాన్ని కోరుకుంటున్నాం
మణిపూర్ లో చోటుచేసుకున్న అల్లర్లపై బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ (mary kom) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “నా రాష్ట్రం తగలబడిపోతోంది.. దయచేసి కాపాడండి” అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మీడియాను అభ్యర్థించారు. మణిపూర్ లో ప్రస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, ఎవరూ సురక్షితంగా లేరని ఆవేదన చెందారు. హింసాత్మక ఘటనల్లో కొంత మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారని తెలిపారు. తామంతా శాంతి, సామరస్యాన్ని కోరుకుంటున్నామని మీడియాతో చెప్పారు.

బీరెన్ సింగ్‌తో మాట్లాడిన అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) బుధవారం మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్‌తో ఫోన్ లో మాట్లాడారు. అల్లర్ల నేపథ్యంలో రాష్ట్రంలో తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరిన్ని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీమ్ లను మణిపూర్ కు పంపినట్టు తెలిపారు. కల్లోల ప్రాంతాలకు ఇప్పటికే ఆర్మీ, పారామిలిటరీ బలగాలను మణిపూర్ కు తరలించినట్టు వెల్లడించారు. కర్ఫ్యూ విధించిన ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. దాదాపు 10 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు.

అన్ని చర్యలు తీసుకుంటున్నాం: బీరెన్ సింగ్‌
అల్లర్లను కట్టడి చేసేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌ తెలిపారు. రెండు వర్గాల మధ్య ఉన్న అపార్థం ఫలితంగా ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని అన్నారు. గత 24 గంటల్లో కొన్ని చోట్ల ఘర్షణలు, విధ్వంసక సంఘటనలు నమోదయినట్టు చెప్పారు. మణిపూర్ పొరుగున ఉన్న మిజోరం కూడా స్పందించింది. మణిపూర్ లో శాంతి నెలకొనాలని మిజోరం సీఎం జోరంతంగా (Zoramthanga) ఆకాంక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌తో ఫోన్ లో మాట్లాడినట్టు వెల్లడించారు.

ఇంతకీ ఏంటి వివాదం?
తమకు ఎస్టీ హోదా ఇవ్వాలని మెయితీ తెగవారు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దాదాపు పదేళ్ల నుంచి ఈ వివాదం నడుస్తోంది. మెయితీల డిమాండ్ పై అప్పటి ప్రభుత్వం.. హిల్ ఏరియాస్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ పరిశీలన తర్వాత మెయితీలకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించింది. దీనిపై మెయితీస్ మణిపూర్ హైకోర్టు ఆశ్రయించారు. మెయితీలకు ఎస్టీ హోదా కల్పించే అవకాశాన్ని 4 నాలుగు వారాల్లోగా తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Also Read: యూపీలో మరో భారీ ఎన్‭కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‭స్టర్ అనిల్ దుజానాను హతమార్చిన టాస్క్‭ఫోర్స్ పోలీసులు

ఈ నేపథ్యంలో చురచంద్‌పూర్ (Churachandpur) జిల్లా తొర్బంగ్ లో గిరిజన సంఘాలు చేపట్టిన సంఘీభావ యాత్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అల్లర్లు చెలరేగి హింసాత్మక ఘటనలు రాష్ట్రమంతా పాకాయి. ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో వాహనాలకు నిప్పుపెట్టారు. ప్రార్థనాలయాలు, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. అల్లర్ల నియంత్రణకు రాజధాని మణిపూర్ తో పాటు చురచంద్‌పూర్, కాంగ్‌పోక్పి, ఇంఫాల్ వెస్ట్, కక్చింగ్, తౌబాల్, జిరిబామ్, బిష్ణుపూర్, తెంగ్నౌపాల్‌లలో రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. మొబైల్ ఇంటర్నెట్ సేవలను ఆపేసింది.

Also Read: “బాహుబలి”లో భల్లాలదేవ పట్టాభిషేక మహోత్సవం కంటే అద్భుతంగా కింగ్ ఛార్లెస్-III పట్టాభిషేకం.. 10 అంశాలివిగో