మాస్క్ పెట్టుకోకుంటే ఫైన్ భారీగా పెరిగింది జాగ్రత్త.. నేటి నుంచే పైసా వసూల్

  • Publish Date - September 14, 2020 / 01:18 PM IST

Maharashtra Gov Face mask fine up : కరోనా టైమ్..మాస్క్ పెట్టుకోకుంటే జేబులు ఖాళీ అవుతాయని ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నా..చాలామంది నిర్లక్ష్యం మహమ్మారి పెరగటానికి కారణమవుతోంది. ఫైనే కదా కట్టేస్తే పోలా అనుకునే నిర్లక్ష్యం కొంప ముంచుతోంది. దీనిపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు వేగంగా ప్రబలుతున్నా మాస్క్‌ ధరించకుండా తిరుగుతున్నారని .. కనీస జాగ్రత్త చర్యలు పాటించక నిర్లక్ష్యంతో వైరస్‌ను కొనితెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ క్రమంలో మాస్క్ పెట్టుకోకపోతే విధించే జరిమానాను మరింతగా పెంచారు. ముఖానికి మాస్క్‌ తప్పనిసరి చేసినా.. మాస్క్ ధరించని వారికి నాగపూర్‌ నగరంలో రూ.200 జరిమానా విధిస్తున్నా ఎవరూ వినకపోవటంతో.. రూ.500లకు పెంచుతున్నామని తెలిపారు. పెరిగిన ఈ ఫైన్ సెప్టెంబ‌ర్ 14 నుంచి అమలు చేస్తామని తెలిపారు.


కరోనా వ్యాక్సిన్‌ వచ్చే వరకన్నా కాస్త జాగ్రత్త చర్యలు పాటించాలని కోరుతున్నామని ఇప్పటికైనా ప్రజలు మాస్కులు ధరించటంతో శ్రద్ధవహించాలని అది అందరికీ మంచిదని సూచించారు. భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను అనుసరించాలని..సూచించారు.


కాగా..గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 97,654 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 47,51,788కి పెరిగింది. మరణాల సంఖ్య 78,614కు పెరిగింది. ఒక్క మహారాష్ట్రలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షల మార్కును దాటింది.