కొలిక్కి వచ్చిన మోదీ కేబినెట్.. ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురికి చోటు!

నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

కొలిక్కి వచ్చిన మోదీ కేబినెట్.. ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురికి చోటు!

Modi Cabinet Ministers List

Updated On : June 9, 2024 / 1:22 PM IST

Modi Govt 3.0 Cabinet Ministers List : నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇవాళ రాత్రి 7.30గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీచే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే వారికి సమాచారం అందించారు. ప్రమాణ స్వీకారానికి ముందు ప్రధాని నివాసానికి రావాలని వారికి పిలుపు అందింది. మంత్రులుగా ప్రమాణ స్వీకారంచేసే నేతలందరికీ ప్రధాని నివాసంలో తేనీటి విందు ఇవ్వనున్నారు. ఇదిలాఉంటే .. మంత్రివర్గ కూర్పుపై సుదీర్ఘంగా కసరత్తు సాగింది. ఆర్ఎస్ఎస్ నేత‌లుకూడా పాల్గొన్నారు. శ‌నివారం రాత్రి కేంద్ర‌ మంత్రి వ‌ర్గం కూర్పుపై ప్రధాని న‌రేంద్ర‌ మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ లు సుదీర్ఘంగా చ‌ర్చించారు. మంత్రి పదవులపై మిత్రపక్షాల అధినేతలకు బీజేపీ అగ్ర నాయకత్వం స‌మాచారం ఇచ్చింది. మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనతాదళ్ యునైటెడ్, శివసేన షిండే, లోక్ జనశక్తి (పాశ్వాన్ ) పార్టీలకు కేబినెట్ లో ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవులు ఇవ్వ‌నున్నారు.

Also Read : రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు.. అంత్యక్రియల్లో పాల్గొన్న రాజకీయ, సినీ ప్రముఖులు

ఐదుగురు అంతకుమించి ఎంపీలు ఉన్న పార్టీలకు ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి. రెండు, మూడు ఎంపీలు వున్నవారికి ఒక సహాయ మంత్రి పదవి కేటాయించారు. ఇప్పటివరకు పార్టీ బాధ్యతలు నిర్వహించిన బీజేపీ నేత‌ల‌కు ఈ సారి ప్రభుత్వంలో భాగ‌స్వామ్యం చేయ‌నున్నారు. లోక్ సభ కు ఎన్నికైన నలుగురు మాజీ సీఎంలు చౌహాన్, ఖట్టర్, బిబల్, బొమ్మయ్ లకు తగు ప్రాతినిధ్యం క‌ల్పించ‌నున్నారు. నలుగురిలో ఒకరిని స్పీకర్ గా ఎంపిక చేసే అవకాశం ఉంది. పదవీ కాలం ముగుస్తున్నందున కేంద్ర కేబినెట్ లోకి జెపి నడ్డా కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంది. రక్షణ, హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు సహా విద్య, సాంస్కృతిక శాఖలు బిజేపీ ఎంపీల‌కే ద‌క్క‌నున్నాయి. పట్టణాభివృద్ధి, ఐటీ, సామాజిక న్యాయం శాఖలు టీడీపీకి కేటాయించే అవకాశం ఉంది. రైల్వేలు, వ్యవసాయ శాఖలు జేడీయుకి కేటాయించే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్, మహారాష్ట్ర‌లకు కేబినెట్ లో తగిన ప్రాతినిధ్యం ఇవ్వ‌నున్నారు.

Also Read : కేంద్ర క్యాబినెట్ లోకి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని.. వారికి కేటాయించే శాఖలు ఏమిటంటే?

కేంద్ర కేబినెట్ లోకి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు లభించనున్నట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి కేంద్ర మంత్రిగా శ్రీ‌కాకుళం ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు, స‌హాయ మంత్రిగా గుంటూరు ఎంపీ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ ల‌కు అవ‌కాశం ద‌క్కనుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా కిష‌న్ రెడ్డి, స‌హాయ మంత్రిగా బండి సంజ‌య్ కు కేంద్ర క్యాబినెట్ లో అవ‌కాశం దక్కనుంది. ఇదిలాఉంటే.. ఏపీ బీజేపీ నుంచి శ్రీనివాస్ వర్మకు కూడా మోదీ క్యాబినెట్ లో చోటు లభించనున్నట్లు తెలుస్తోంది. పురందేశ్వరికి లోక్ సభ స్పీకర్ పదవి అప్పగించే అవకాశం ఉందని బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా మిత్రపక్షాల నుండి ప్రఫుల్ పటేల్, చిరాగ్ పాశ్వాన్, అనుప్రియ పటేల్, జయంత్ చౌదరి, జతిన్ రామ్ , కుమార స్వామి తదితరులు కేంద్ర మంత్రులుగా ఇవాళ ప్ర‌మాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.

మోదీ 3.0 క్యాబినెట్ ఇదే..
రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మాండవీయ, ఇంద్రజిత్ సింగ్, కిషన్ రెడ్డి (బీజేపీ – తెలంగాణ), బండి సంజయ్ (బీజేపీ – తెలంగాణ), రామ్మోహన్ నాయుడు (టీడీపీ -ఏపీ), పెమ్మసాని చంద్రశేఖర్ (టీడీపీ – ఏపీ), శ్రీనివాస వర్మ (బీజేపీ-ఏపీ), కుమార స్వామి (జేడీఎస్), లలన్ సింగ్ (జేడీయూ), రామ్ నాథ్ ఠాకూర్, జయంత్ చౌదరి (ఆర్ఎల్డీ), జితిన్ రామ్ మాంజీ (హిందూస్తాన్ ఆవం మోర్చా), ప్రతాప్ రావ్ జాదవ్ (శివసేన), ప్రపుల్ పటేల్ (ఎన్సీపీ), అనుప్రియా పాటిల్ (అప్నాదళ్)