Narendra Tomar కేంద్రవ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు వ్యవసాయం గురించి ఏమీ తెలియదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. తోమర్ మంచి వ్యక్తి అని..కానీ ఆయనకు వ్యవసాయం గురించి ఏమీ తెలియదని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.
నూతన వ‌్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 72 రోజుల నుంచి రైతులు ఆందోళన మరియు ఇప్పటివరకు రైతులతో కేంద్రం 11 దఫాలు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడం లాంటి పరిణామాల నేపథ్యంలో శుక్రవారం దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు మంత్రులు రైతులతో చర్చలు జరిపారని, వారిలో నరేంద్రసింగ్ తోమర్ మంచివాడే అయినా వ్యవసాయం గురించి ఆయనకు ఏమీ తెలియదని దిగ్విజయ్ వ్యాఖ్యానించారు. ఇక మరో మంత్రి పీయూష్ గోయల్ కార్పొరేట్ రంగానికి అధికార ప్రతినిధి అని ఆరోపించారు. పరిస్థితులను బట్టి చూస్తుంటే నూతన వ్యవసాయ చట్టాల ముసాయిదా రూపకల్పన దేశ రాజధాని ఢిల్లీలో కాకుండా ముంబైలో జరిగిందేమోదని దిగ్విజయ్ సింగ్ అనుమానం వ్యక్తంచేశారు.
కాగా, గతేడాది పార్లమెంట్ ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ తో ఆందోళన చేస్తోన్న రైతులతో 11 సార్లు జరిపిన చర్చల్లో కేంద్రం తరపున పాల్గొన్న వారిలో తోమర్,గోయల్ ముఖ్యులన్న విషయం తెలిసిందే. వ్యవసాయ చట్టాలను 18 నెలలపాటు నిలిపివేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించగా..రైతు సంఘాలు ప్రభుత్వ ఆఫర్ ని తిరస్కరించాయి. చట్టాల రద్దే కావాలని రైతు సంఘాలు పట్టుబడుతుండగా..రద్దు చేసే ప్రశక్లే లేదని మోడీ సర్కార్ తేల్చి చెప్పింది. దీంతో ఇక ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు ఏవిధంగా లభిస్తుందో చూడాలి.