Education Minister Ramesh Pokhriyal మెడిసిన్ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ 2021 పరీక్షను రద్దు చేసే అవకాశం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ చెప్పారు. 2021లో ఏ పరీక్షను కూడా రద్దు చేసే ఆలోచన లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు.
అన్ లాక్ లో భాగంగా అన్నీ తెరిచినా, విద్యా సంస్థలను మాత్రం ఇంకా మూసేఉంచుతూ, ఎప్పుడు తెరుస్తారో కూడా క్లారిటీ లేకపోవడంతో 2021లో జరగాల్సిన పోటీ పరీక్షలన్నీ రద్దయిపోతాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నీట్-2021 రద్దు నిర్ణయం తీసుకున్నారంటూ వార్తలు రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వారిలో అనుమానాలను తీర్చేందుకు కేంద్రం ఎట్టకేలకు ముందుకొచ్చింది.
గురువారం కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్… ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2021లో జరిగే CBS, JEE మెయిన్ నీట్ పరీక్షలపై నెలకొన్న అనుమానాలపై సమాధానాలిచ్చారు. JEE మెయిన్స్ ఏడాదికి మూడు, నాలుగు సార్లు నిర్వహించే అంశంపై కూడా నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. జేఈఈ 20201 దరఖాస్తు ప్రక్రియ ఈ డిసెంబర్ నుంచే ప్రారంభం అవుతుందని, పరీక్షను జనవరికి బదులుగా ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహిస్తామని, ఏప్రిల్ జరగాల్సిన రెండో విడత జేఈఈ (మెయిన్)-2021 పరీక్షలను సెప్టెంబర్‌లో నిర్వహిస్తామని, అదే సమయంలో అటెంప్ట్‌ల సంఖ్యను గరిష్టంగా 4కు పెంచుతామని తెలిపారు.
సీబీఎస్ఈ పరీక్షలపై పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పరిస్థితులు మెరుగవకపోతే విద్యార్థులకు మరింత సమయం కల్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో పోటీ/బోర్డు పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన అధికారులను కేంద్రమంత్రి అభినందించారు. కాగా,కరోనా వ్యాప్తి కేసులు తగ్గుతుండటంతో స్కూళ్లు తిరిగి ప్రారంభిస్తామని..ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించాయన్నారు.
ఈ సారి నీట్ ఎగ్జామ్ సెంటర్లను మరిన్ని పెంచుతామని, విద్యార్థులు పరీక్ష రాసేందుకు అనువైన పరిస్థితులు కల్పిస్తామని అన్నారు. ఇప్పటికే నీట్‌ను మూడుసార్లు వాయిదా వేశామని.. ప్రస్తుత పరిస్థితుల్లోనూ రద్దు చేయవచ్చన్నారు. కానీ అలా చేస్తే విద్యార్థులకు భారీ నష్ట కలుగుతుందన్నారు. ప్రస్తుతం ఆఫ్‌లైన్‌లోనే నీట్ పరీక్ష జరుగుతోందని, విద్యార్థులు ఆన్‌లైన్‌లో జరగాలని కోరుకుంటే ఆ అంశాన్ని కూడా పరిశీలిస్తామని తెలిపారు. త్వరలో పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు.