Modi (1)
Net-Zero Emissions 2070 నాటికి కర్బన ఉద్గార రహిత దేశంగా భారత్ మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఇంగ్లాడ్ లోని గ్లాస్గో వేదికగా జరిగిన ఐరాస వాతావరణ సదస్సు (COP26)లో ప్రధాని ప్రసంగించారు. భారత్ 2070 సంవత్సరానికల్లా కర్బన ఉద్గారాల రహిత దేశంగా మారుతుందని, అందుకోసం దేశం 2030 వరకు సాధించాల్సిన లక్ష్యాలను పంచామృత్ పేరుతో ఐదు లక్ష్యాలను భారత్ నిర్దేశించుకుందని, ఆ లక్ష్యాలను చేరుకుంటామని ప్రధాని పేర్కొన్నారు.
5 లక్ష్యాలు
1. 2030 నాటికి భారత్ శిలాజేతర ఇంధనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని 500గిగావాట్లకు తగ్గించడం.
2. మొత్తం కరెంటు వినియోగంలో పునరుత్పాదక విద్యుత్తు వాటాను 50 శాతానికి పెంచడం.
3. 2030నాటికి భారత్ తన కర్బన ఉద్గారాలను 100 కోట్ల టన్నుల మేర తగ్గిస్తుంది.
4. భారత్ తన ఆర్థిక వ్యవస్థలో కర్బన ఉద్గారాల కోసం ఖర్చు చేస్తున్న ఖర్చును 45శాతం మేర తగ్గిస్తుంది.
5. 2070నాటికి భారత్‌ను కర్బన ఉద్గారాల రహిత(నెట్ జీరో) దేశంగా మార్చడం.
ఈ ఐదు చర్యలు.. వాతావరణ మార్పుల కట్టడిలో అద్భుత పాత్ర పోషిస్తాయని మోదీ తెలిపారు. వాతావరణ మార్పుల నియంత్రణకు కర్బన ఉద్గారాల తీవ్రతను తగ్గించడంపైనే ప్రపంచ దేశాలు దృష్టి పెడుతున్నాయని.. అది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనన్నారు. కర్బన ఉద్గారాల విడుదల నియంత్రణకు కొన్ని శాశ్వత పరిష్కార పద్ధతులను అందిపుచ్చుకోవాలని అన్నారు. కాలుష్య నివారణకు సంఘటిత పోరాటమే పరిష్కారమని మోదీ సూచించారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి ధ్యేయం కావాలని ప్రపంచ నేతలకు ప్రధాని పిలుపునిచ్చారు. ప్రకృతితోనే మానవ జీవితాలు ముడిపడి ఉన్నాయని… వాతావరణ మార్పులు మన జీవన విధానంపై మార్పులు చూపుతాయని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు వాతావరణ మార్పుల కట్టడి కోసం 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.
వాతావరణ మార్పుల కట్టడికి పారిస్ ఒప్పందంలోని తీర్మానాలకు అనుగుణంగా కార్యచరణ చేపట్టిన పెద్ద ఆర్థిక వ్యవస్థ గల ఏకైక దేశం భారత్ అని ఈ సందర్భంగా మోదీ స్పష్టం చేశారు. వాతావరణ మార్పుల కట్టడి కోసం భారత్ ఎంతో శ్రమిస్తోందని.. దాని ఫలితాలు త్వరలోనే వస్తాయన్నారు. భారత్ తన విధానాలలో వాతావరణ మార్పులను కేంద్ర స్థానంలో ఉంచుతోందని మోదీ తెలిపారు. రాబోయే తరానికి ఈ సమస్యలపై అవగాహన కల్పించేందుకు పాఠశాల సిలబస్ లో వాతావరణ అనుకూల విధానాలను చేర్చాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.
కాగా, కర్బన ఉద్గారాల నికర సున్నా లక్ష్యాన్ని ప్రకటించిన ప్రపంచంలోని దేశాల్లో భారత్ చివరిది. 2060 నాటికి ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని చైనా ప్రకటించగా, అమెరికా, బ్రిటన్‌లు 2050ను లక్ష్యంగా నిర్ధేశించుకున్నాయి. 2030నాటికి ప్రపంచ కర్బన ఉద్గారాలను సగానికి తగ్గించి, 2050 నాటికి నికర సున్నాకి చేరుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ALSO READ Political RRR: ట్రిపుల్ ఆర్ పోస్టర్‌తో ప్రగతి భవన్‌కు బీజేపీ కార్యకర్తలు