Night Curfew In Jaipur : రాజస్థాన్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతోంది. కరోనా కేసుల నేపథ్యంలో జైపూర్‌లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.
రాజస్థాన్ సహా కొన్ని ప్రాంతాల్లో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. జైపూర్, జోధాపూర్, కోటా, బికనీర్, ఉదాయ్ పూర్, అజ్మీర్, అల్వార్, భిల్వారా ప్రాంతాల్లోనూ కర్ఫూ విధించారు. కర్ఫ్యూ సమయంలో బయట తిరిగేందుకు అనుమతి లేదు.
ఎవరైనా అతిక్రమిస్తే కఠిన ఆంక్షలు విధించారు. మాస్క్ లేకుండా బయటకు వచ్చినవారికి విధించే జరిమానాను రూ.200 నుంచి రూ.500కు పెంచారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్ర మండలి అధికారులు చర్యలు చేపట్టారు.
కరోనా ప్రభావిత ప్రాంతాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. ఇప్పటికే కరోనా ప్రభావిత రాష్ట్రాల్లో గుజరాత్, మధ్యప్రదేశ్ కేసులు భారీగా పెరిగిపోతుండగా.. లేటెస్టుగా రాజస్థాన్ కూడా చేరింది.
ఇప్పటివరకూ రాజస్థాన్‌లో శనివారం ఒక్క రోజే కొత్తగా 3,007 కరోనా కేసులు నమోదయ్యాయి. 16 మంది మరణించారు. మొత్తంగా రాష్ట్రంలో కరోనా కేసులు 2,40,676 చేరగా, మరణాల సంఖ్య 2,146కు చేరింది.