నీరవ్ మోడీకి భారీ షాక్..అఫ్రూవర్ గా మారిన చెల్లెలు

నీరవ్ మోడీకి భారీ షాక్..అఫ్రూవర్ గా మారిన చెల్లెలు

Updated On : January 6, 2021 / 7:04 PM IST

Nirav Modi’s sister పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణం కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, డైమండ్‌ వ్యాపారి నీరవ్‌ మోడీ నేర చరిత్ర మూలంగా తమ జీవితాలు నాశనమైపోయాయంటూ,వృత్తిపరమైన జీవితాలు స్థంభించిపోయాయని నీరవ్‌ సోదరి పూర్వి, ఆమె భర్త మైయాంక్ మెహతా సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో కీలకమైన సాక్ష్యాలను ఇస్తామంటూ అప్రూవర్‌గా మారేందుకు వారు సంసిద్ధతను వ్యక్తం చేశారు.

పుర్వీ బెల్జియం సిటిజన్‌ కాగా, మయాంక్‌ బ్రిటీష్‌ నివాసి. పీఎన్‌బీ స్కాం,నీరవ్‌ నుంచి తమను దూరం చేయాలని కోరుతూ గత నెలలో పూర్వి మెహతా, ఆమె భర్త కోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో తమ పేర్లను తీసివేయాలని కోరుతూ స్పెషల్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌(పిఎంఎల్‌ఎ)కోర్టును తమ న్యాయవాది ద్వారా పుర్వీ దంపతులు అభ్యర్థించారు. అంతేకాదు ఈ కుంభకోణానికి సంబంధించి కీలక సమాచారాన్ని, సాక్ష్యాలను అందించేందుకు అంగీకరించారు.

ఈ పిటిషన్‌ను పరిశీలించిన ప్రత్యేక జడ్జి విసి బార్డే…వారు భారత్‌ వచ్చేందుకు..వాంగ్మూలాన్ని కోర్టులో ప్రవేశపెట్టేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ను ఆదేశించారు. క్షమాపణ తెలిపిన తరువాత నీరవ్ చెల్లెలు పూర్వి , ఆమె భర్తను అప్రూవర్లుగా అంగీకరించాలని కోర్టు తెలిపింది. పూర్విపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అభియోగాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పూర్వీ కీలక సూత్రధారి అని చార్జీషీట్‌లో పేర్కొంది. మోసపూరిత మార్గాల ద్వారా సోదరుడు నీరవ్‌ నుండి భారీగా సొమ్మును తీసుకున్నారని తెలిపింది.

కాగా, తనకు ఈ లావాదేవీలతో ఎటువంటి సంబంధం లేదని పుర్వీ పేర్కొన్నారు. తాము ఈ కేసుల్లో ప్రధాన నిందితులం కాదని, కేవలం పరిమిత పాత్రధారులమని, కావున తాము అప్రూవర్‌గా మారతామని, ఈ కేసు నుండి విముక్తి కలిగించాలని వేర్వేరు పిటిషన్లలో పుర్వీ దంపతులు కోరారు. అంతేకాకుండా నీరవ్‌ మోడీ లావాదేవీలకు సంబంధించిన సాక్ష్య్యాలు, ఆధారాలు, ఇతర సమాచారాన్ని అందించారు.

కాగా పీఎన్‌బీ స్కాంలో నీరవ్ మోడీ , అతని మామ మెహుల్ చోక్సీ, కొంతమంది బ్యాంకు అధికారులతో కుమ్మక్కై తప్పుడు పత్రాలతో పీఎన్‌బీని రూ .14 వేల కోట్లకు ముంచేశాడు. అనంతరం విదేశాలకు పారిపోయిన నీరవ్‌ను 2019 మార్చిలో భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. లండన్‌ జైల్లో ఉన్న నీరవ్‌ను భారత్‌కు అప్పగించే అంశం విచారణలో ఉంది.