మోదీ కాళ్లు మొక్కి.. బిహార్ ప్రజలను అవమానించారు: సీఎం నితీష్‌పై పీకే ఫైర్

రాష్ట్ర నాయకుడు అనే వాడు అక్కడి ప్రజలకు గర్వకారణం. కానీ తన అధికారాన్ని నిలుపుకోవడం కోసం ప్రధాని మోదీ పాదాలను తాకి బిహార్ ప్రజలను నితీష్ కుమార్ అవమానించారని...

Prashant Kishor on  Nitish Kumar: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారం కోసం ఎంతకైనా దిగజారతారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం నీతీష్ పాదాభివందనం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. గతవారం ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో మోదీని నితీష్ పాదాభివందనం చేశారు. దీనిపై ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. “రాష్ట్ర నాయకుడు అనే వాడు అక్కడి ప్రజలకు గర్వకారణం. కానీ నితీష్ కుమార్ తన అధికారాన్ని నిలుపుకోవడం కోసం ప్రధాని మోదీ పాదాలను తాకి బిహార్ ప్రజలను అవమానానికి గురిచేశార”ని వ్యాఖ్యానించారు.

‘జన్ సురాజ్’ ప్రచారంలో భాగంగా భాగల్పూర్‌లో జరిగిన బహిరంగ సభలో శుక్రవారం ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బిహార్ ప్రయోజనాల కోసం నితీష్ కుమార్ పనిచేయడం లేదని, స్వప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. “ప్రధాని మోదీ తిరిగి అధికారంలోకి రావడంలో నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించారు. కానీ బిహార్ సీఎం తనకు వచ్చిన ఎలా ఉపయోగించుకుంటున్నారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన తన పలుకుబడిని వాడకుండా కాళ్లు మొక్కుతున్నారు. బీజేపీ మద్దతుతో 2025 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా బిహార్ సీఎంగా కొనసాగాలన్న ఉద్దేశంతోనే మోదీ కాళ్లు మొక్కుతున్నారని దుయ్యబట్టారు.

కాగా, గతంలో నితీష్ కుమార్‌తో ప్రశాంత్ కిషోర్ కలిసి పనిచేశారు. 2015లో జేడీయూ అధ్యక్షుడి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆయన రెండేళ్ల తర్వాత అధికారికంగా ఆ పార్టీలో చేరారు. తర్వాత నితీష్ కుమార్‌తో విభేదించి జేడీయూ నుంచి బయటకు వచ్చారు. 2014లో మోదీ తరపున రాజకీయ వ్యూహకర్తగా పనిచేసి ఆయన విజయంలో కీలకపాత్ర పోషించారు. 2021లో పొలిటికల్ కన్సల్టెన్సీని వదులుకునే సమయానికి.. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సహా పలువురు ఉన్నత స్థాయి రాజకీయ నాయకుల కోసం పనిచేశారు.

Also Read: జాతీయ భద్రతా సలహాదారుగా మూడోసారి కూడా అజిత్ ధోవల్.. ఎందుకో తెలుసా?

తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ రాకపోవడంతో టీడీపీ, జేడీయూ మద్దతుతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బిహార్ లో 12 ఎంపీ సీట్లు గెలిచిన జేడీయూ.. ఎన్డీఏ కూటమిలో టీడీపీ తర్వాత రెండవ అతిపెద్ద మిత్రపక్షంగా అవతరించింది. మోదీ సర్కారుకు టీడీపీ, జేడీయూ మద్దతు కీలకం కావడంతో ఏపీ, బిహార్ ప్రయోజనాల కోసం పట్టుబట్టాలని రెండు రాష్ట్రాల్లోని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Also Read: స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించారు.. బీజేపీ తరపున పోటీ చేస్తే ఓడించారు: నవనీత్‌ రవి రాణా ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు