Bihar Politics : బీహార్‌లో కొలువుదీరనున్న ఎన్డీయే ప్రభుత్వం.. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నితీశ్.. ఇద్దరు డిప్యూటీలు సహా ఎనిమిది మంది మంత్రులు కూడా
సీఎంగా నితీశ్ కుమార్ తొమ్మిదోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 5గంటలకు గవర్నర్ సమక్షంలో ఎన్డీయే కూటమి సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Nitish Kumar
Bihar Politics : బీహార్ లో గతకొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ గందరగోళానికి తెరపడనోంది.. నితీశ్ కుమార్ ఉదయం 11 గంటల సమయంలో గవర్నర్ వద్దకు వెళ్లి సీఎం పదవికి రాజీనామా లేఖను అందజేశారు. మహాకూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరారు. మరోవైపు బీజేపీ, జేడీయూ ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ రాజేంద్రను నితీశ్ కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్ కు అందజేశారు. ఆయన అభ్యర్థనకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. దీంతో సాయంత్రం 5గంటల సమయంలో గవర్నర్ సమక్షంలో ఎన్డీయే కూటమి సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలతో పాటు ఎనిమిది మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ప్రమాణ స్వీకారం చేసేది వీరే..
సీఎంతో ప్రమాణ స్వీకారం చేసేవారిలో ఇద్దరు ఉపముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి (బీజేపీ), విజయ్ కుమార్ సిన్హా(బీజేపీ) ఉన్నారు. వీరితో పాటు మంత్రులుగా డాక్టర్ ప్రేమ్ కుమార్ (బీజేపీ), విజేంద్ర యాదవ్ (జేడీయూ), విజయ్ చౌదరి (జేడీయూ), శ్రవణ్ కుమార్ (జేడీయూ), సంతోష్ సుమన్ (హెచ్ఏఎం), సుమిత్ సింగ్ (స్వతంత్ర)లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరు కానున్నారు. సాయంత్రం 4.15 గంటలకు ఆయన పట్నాకు చేరుకోనున్నారు.