మోడీ హయాంలో ఈశాన్యంలో అభివృద్ధి వరద…అమిత్ షా

Amit Shah ఈశాన్య రాష్ట్రాల్లో మూడో, చివరి రోజు పర్యటనలో భాగంగా ఆదివారం(డిసెంబర్-27,2020)మణిపుర్​కు వెళ్లారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మణిపూర్ పర్యటనలో హప్తా కాంగ్​జీబంగ్​లో పలు ప్రాజెక్టులకు అమిత్ షా శంకుస్థాపన చేశారు. అనంతరం రాజధాని ఇంఫాల్ లో నిర్వహించిన ఓ స‌భ‌లో ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి అమిత్ షా ప్ర‌సంగించారు. ప్రధాని నరేంద్రమోడీ హృదయంలో ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక స్థానముందని తెలిపారు అమిత్ షా. అందుకే ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి పనులు వరద ప్రవాహంలా కొనసాగుతున్నాయన్నారు.

మోడీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాలకు సరికొత్త గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. మోడీ నేతృత్వంలోని బీజేపీ హయాంలో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని అమిత్​ షా అన్నారు. ఇన్నర్​ లైన్ పర్మిట్ (ILP)ను మణిపుర్​ ప్రజలకు ప్రధాని మోడీ అతిపెద్ద కానుకగా ఇచ్చారని షా అన్నారు. ప్రజలు అడగముందే దీని ఆవశ్యకతను మోడీ గుర్తించారని తెలిపారు.

ఒకప్పుడు మణిపుర్​ అంటే తిరుగుబాటు, బంద్​లు, దిగ్బంధాలకు కేంద్రం అనే వారని, కానీ బీజేపీ హయాంలో పరిస్థితి మారిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్దికి నోచుకోలేదని విమర్శించారు. ఇప్పుడు బీరెన్​ సింగ్​ మూడేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని కితాబిచ్చారు.

సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈశాన్య రాష్ట్రాల కోసం చేసిందేమీ లేద‌ని అమిత్ షా విమర్శించారు. అభివృద్ధికి స‌మ‌స్య‌గా మారిన తీవ్ర‌వాద సంస్థ‌ల‌తో చ‌ర్చించ‌డానికి కాంగ్రెస్ ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేయ‌లేద‌న్నారు. తీవ్ర‌వాద కార్య‌కలాపాల కార‌ణంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయార‌ని, అభివృద్ధి అడుగున ప‌డిపోయిందని వ్యాఖ్యానించారు. న‌రేంద్ర‌మోడీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో శాంతిభ‌ద్ర‌త‌లు నెల‌కొల్ప‌డానికి, అభివృద్ధికి ఎన్నో చ‌ర్య‌లు చేప‌ట్టార‌ని అమిత్ షా చెప్పారు. మొత్తం ఎనిమిది తీవ్ర‌వాద సంస్థ‌ల‌కు చెందిన 644 మంది 2,500 ఆయుధాల‌తో లొంగిపోయి జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో క‌లిశార‌ని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పేరుతో కేవ‌లం భూమి పూజ‌లు చేసి వ‌దిలేసింద‌ని, తాము ఆ ప్రాజెక్టుల‌ను పూర్తిచేసి ప్రారంభించామ‌ని అమిత్ షా చెప్పారు.