మమత ఝలక్…600కి.మీ రోడ్డు మార్గంలో గవర్నర్

వెస్ట్ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య ఘర్షణ ఇప్పుడు కొత్త దశలోకి ప్రవేశించింది. బెంగాల్ గవర్నర్‌కు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ఝలక్ ఇచ్చారు.
ఫరక్కాలో ఇవాళ(నవంబర్-15,2019) నిర్వహించే ప్రొఫెసర్ ఎస్‌ఎన్‌హెచ్ కాలేజీ రజతోత్సవ కార్యక్రమానికి గవర్నర్ జగ్‌దీప్ ధన్ కర్ ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సి ఉంది. ఇందు కోసం హెలికాప్టర్ సమకూర్చాలని సీఎంవోకు ఆయన కార్యాలయం విజ్ఞప్తి చేసింది. కానీ ఆ విజ్ఞప్తిని అధికారులు తిరస్కరించారని, తనకు ఈ విషయంపై చీఫ్ సెక్రటరీ కానీ,సీఎం నుంచి కానీ ఎలంటి రెస్ఫాన్స్ రాలేదని ఓ ప్రకటనలో గవర్నర్ తెలిపారు. దీంతో 600 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గం ద్వారా గవర్నర్ దంపతులు ప్రయాణిస్తారని రాజ్ భవన్ విడుదల చేసిన ప్రెస్ నోట్ లో తెలిపింది. ఆయనకు ఇలా జరగడం ఇది రెండోసారి.
ఈ సందర్భంగా గవర్నర్ పై మమత విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు దారితీసిన గవర్నర్ పాత్ర గురించి అడిగనప్పుడు.. రాజ్యాంగబద్ధ పదవులపై తాను కామెంట్ చేయదల్చుకోలేదని,అయితే రాజ్యాంగ పదవుల్లో ఉన్న కొందరు బీజేపీ ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్నారని సీఎం మమతా బెనర్జీ అన్నారు. వెస్ట్ బెంగాల్ లో కూడా గవర్నర్ ఇలానే వ్యవహరిస్తున్నారన్నారు. గవర్నర్ ద్వారా బీజేపీ సమాంతర ప్రభుత్వం రన్ చేయాలనుకుంటుందని మమత ఆరోపించారు.