×
Ad

Bengaluru Civic Polls: ఈవీఎంలు కాదు బ్యాలెట్ పేపర్లే.. బెంగళూరు ఎన్నికలపై ఎస్ఈసీ కీలక నిర్ణయం

బ్యాలెట్ పత్రాలను ఉపయోగించడం వల్ల ఎటువంటి హాని లేదని కర్ణాటక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంగ్రేషి అన్నారు. EVMలను మాత్రమే వాడాలని ఎటువంటి ఆదేశం లేదన్నారు.

Bengaluru Civic Polls Representative Image (Image Credit To Original Source)

 

  • కర్నాటక ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం
  • కార్పొరేషన్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల వాడకం
  • ఈవీఎంలపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్

Bengaluru Civic Polls: గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జీబీఏ) పరిధిలో 5 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లు ఉపయోగించాలని ఎస్ఈసీ నిర్ణయించింది. ఎస్ఎస్ ఎల్ సీ, పీయూసీ పరీక్షలు అయిపోగానే.. మే 25 తర్వాత కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జీఎస్‌ సంగ్రేశి తెలిపారు. కాగా, ఈవీఎంల బదులుగా బ్యాలెట్ పేపర్లను ఎంచుకోవడానికి SEC నిర్దిష్ట కారణాలను పేర్కొనలేదు. అయితే, రాబోయే ఎన్నికల్లో EVMలను ఉపయోగించబోము అని స్పష్టం చేసింది.

బ్యాలెట్ పేపర్లపై ఎటువంటి నిషేధం లేదు..

బ్యాలెట్ పత్రాలను ఉపయోగించడం వల్ల ఎటువంటి హాని లేదని కర్ణాటక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంగ్రేషి అన్నారు. “మా స్థానిక సంస్థల ఎన్నికలు చాలావరకు ఇప్పటికీ బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి జరుగుతున్నాయి. మనం వాటిని ఎందుకు ఉపయోగించకూడదు? EVMలను మాత్రమే వాడాలని ఎటువంటి ఆదేశం లేదు. బ్యాలెట్ పేపర్లపై ఎటువంటి నిషేధం లేదు” అని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల్లో జరిగే అవకతవకలపై ఆందోళనల గురించి ఆయన ప్రస్తావించారు. స్వేచ్ఛగా నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేలా చూసేందుకు అన్ని పోలింగ్ బూత్‌లలో తగినంత సిబ్బందిని మోహరిస్తామని, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. “బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించడానికి మాకు ఎటువంటి సమస్య ఉండదు” అని సంగ్రేషి వ్యాఖ్యానించారు. కాగా, జీబీఏ కార్పొరేటర్ ఎన్నికలకు ఈవీఎంలు వాడాలని సూచిస్తూ ఎన్నికల కమిషన్‌కు బీజేపీ లేఖ రాసిందని తెలిపారు.

5 నగర పాలికెల్లో ఎన్నికలు..

గ్రేటర్‌ బెంగళూరు పరిధిలోని ఐదు నగర పాలికెల ఎన్నికలకు ఎస్ఈసీ కసరత్తు చేస్తోంది. ఐదు నగర పాలికెల్లో ముందస్తు ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సింగ్రేశ్‌ విడుదల చేశారు. పోలింగ్ కు బ్యాలెట్‌ పేపర్ వినియోగిస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఈవీఎంలపై కాంగ్రెస్ పార్టీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఓట్ల చోరీ జరుగుతోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్.. అందుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో నగల పాలికెల ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లు వాడాలని తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది.

పౌరులు GBA వెబ్‌సైట్ gba.karnataka.gov.in లో ముసాయిదా ఓటర్ల జాబితాను యాక్సెస్ చేయవచ్చని కమిషన్ తెలిపింది. ఓటరు జాబితాలో సవరణలు, చేర్పులు, తొలగింపులు, బదిలీలకు 15 రోజుల సమయం ఇచ్చింది. మార్చి 16న తుది ఓటరు జాబితాను విడుదల చేయాలని కమిషన్ భావిస్తోంది.

ముసాయిదా జాబితాలో మొత్తం 88,91,411 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 45,69,193 మంది పురుషులు.. 43,20,583 మంది మహిళలు..1,635 మంది ఇతరులు ఉన్నారు. వెస్ట్ సిటీ కార్పొరేషన్‌లో అత్యధికంగా 27,25,714 మంది ఓటర్లు ఉండగా, తూర్పు సిటీ కార్పొరేషన్‌లో అత్యల్పంగా 10,41,738 మంది ఉన్నారు. 5 నగర పాలికెల పరిధిలో 369 వార్డులు ఉన్నాయని.. 8వేల 44 పోలింగ్‌ బూత్‌లు ఉంటాయని చెప్పారు.

పౌరులు తమ ఓటు హక్కును నమోదు చేసుకుని వినియోగించుకోవాలని కమిషన్ కోరింది. నామినేషన్ల తేదీ వరకు ఓటర్లు తమ పేర్లను జోడించుకునే అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది.

Also Read: “బిచ్చగాడు” సినిమా స్టోరీ కాదు.. ఈ యాచకుడు నిజంగానే కోటీశ్వరుడు.. అయినా రోడ్లపై అడుక్కుంటున్నాడు?