“బిచ్చగాడు” సినిమా స్టోరీ కాదు.. ఈ యాచకుడు నిజంగానే కోటీశ్వరుడు.. అయినా రోడ్లపై అడుక్కుంటున్నాడు?

భిక్షగా వచ్చిన డబ్బును జీవనానికి ఖర్చు చేయలేదని మాంగీలాల్ విచారణలో ఒప్పుకున్నాడు.

“బిచ్చగాడు” సినిమా స్టోరీ కాదు.. ఈ యాచకుడు నిజంగానే కోటీశ్వరుడు.. అయినా రోడ్లపై అడుక్కుంటున్నాడు?

Crorepati Beggar (Image Credit To Original Source)

Updated On : January 20, 2026 / 9:43 AM IST
  • మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘటన
  • రాత్రి పూట వడ్డీ వ్యాపారం చేస్తున్న బిచ్చగాడు 
  • 3 ఇళ్లు, 3 ఆటోరిక్షాలు, మారుతీ సుజుకి డిజైర్ కారు

Indore: “బిచ్చగాడు” సినిమాలో హీరో కోటీశ్వరుడైనప్పటికీ యాచకుడిగా మారి అడుక్కుంటాడు. నిజ జీవితంలోనూ ఓ వ్యక్తి కోటీశ్వరుడైనప్పటికీ ఐరన్‌ కాట్‌పై కూర్చొని అడుక్కుంటున్నాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ను భిక్షగాళ్లు లేని నగరంగా మార్చే లక్ష్యంతో మహిళా శిశు అభివృద్ధి శాఖ చేపట్టిన చర్యల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఇండోర్‌లో ఎప్పుడూ సందడిగా కనపడే సరాఫా బజార్‌లో మాంగీలాల్‌ అనే వ్యక్తి బాల్‌ బేరింగ్‌ చక్రాలు అమర్చిన ఇనుప బండిపై కూర్చుంటాడు. భుజాలపై బ్యాక్‌ప్యాక్‌, చేతులు చెప్పులలో పెట్టుకుని తానే ఇనుప బండిని నెట్టుకుంటూ ముందుకు వెళ్తుంటాడు. అతడిని చూసిన అతడికి భిక్ష వేస్తుంటారు.

మాంగీలాల్‌ వివరాలను సేకరించిన అధికారులు అతడి ఆస్తులు చూసి షాక్ అయ్యారు. శారీరక వైకల్యం ఉన్న ఈ కోటీశ్వరుడి వద్ద ప్రభుత్వ కేటాయింపుతో వచ్చిన ఇల్లు సహా 3 ఇళ్లు, 3 ఆటోరిక్షాలు, మారుతీ సుజుకి డిజైర్ కారు ఉన్నాయి. ఇళ్లలో ఒకటి మూడు అంతస్తుల భవనం. మిగతా 2 ఒక అంతస్తు ఇళ్లు. ఆటోరిక్షాలు, కారును అద్దెకు ఇచ్చేవాడు.

కొన్నేళ్లుగా మాంగీలాల్‌ ఇనుప బండిపై మౌనంగా కూర్చొని భిక్ష అడుక్కుంటున్నాడు. మాంగీలాల్ నోరు తెరిచి అడగకపోయినా అతడు అమాయకంగా పెట్టే ముఖాన్ని చూసి ప్రజలు స్వచ్ఛందంగా డబ్బులు ఇస్తారు. భిక్ష ద్వారా అతికి రోజుకు 400 నుంచి 500 రూపాయలు వచ్చేవి. కానీ, అసలు వ్యాపారం రాత్రి తర్వాత మొదలవుతుందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.

భిక్షగా వచ్చిన డబ్బుతో వడ్డీ వ్యాపారం
భిక్షగా వచ్చిన డబ్బును జీవనానికి ఖర్చు చేయలేదని మాంగీలాల్ విచారణలో ఒప్పుకున్నాడు. ఆ డబ్బును తిరిగి పెట్టుబడిగా పెట్టేవాడు. స్థానిక వ్యాపారులకు ఒక రోజు లేదా ఒక వారం గడువుకు నగదు అప్పుగా ఇచ్చి వడ్డీ వసూలు చేసేవాడు. ప్రతిరోజూ సాయంత్రం వచ్చి వడ్డీ తీసుకునేవాడు. అధికారుల అంచనా ప్రకారం అతడు 4 నుంచి 5 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చి రోజుకు 1,000 నుంచి 2,000 రూపాయలు ఆదాయం పొందేవాడు. ఇందులో వడ్డీ ఆదాయం కూడా ఉంది.

డినేశ్ మిశ్రా మహిళా శిశు అభివృద్ధి అధికారి, రక్షణ ఆపరేషన్ నోడల్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. మాంగీలాల్‌ను ఉజ్జయినిలోని సేవాధామ్ ఆశ్రమానికి తరలించారు. అతడి బ్యాంకు ఖాతాలు, ఆస్తులపై విచారణ సాగుతోంది. అతడి నుంచి డబ్బు తీసుకున్న వ్యాపారులను కూడా ప్రశ్నించనున్నారు.

మాంగీలాల్‌ 2021-22 నుంచి భిక్ష అడుగుతున్నాడు. ప్రస్తుతం అతడిని ఆశ్రయ గృహంలో ఉంచారు. మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి నివేదిక సిద్ధం చేసి కలెక్టర్‌కు సమర్పించారు. తదుపరి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటారని మిశ్రా తెలిపారు.