ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. ఢిల్లీలో ఇకపై పారిశ్రామిక రంగంలో కొత్త తయారీ పరిశ్రమలను అనుమతించబోమని ఆయన ప్రకటించారు. సేవలకు సంబంధించిన మరియు హైటెక్ పరిశ్రమలు మాత్రమే రాష్ట్రంలో అనుమతించనున్నట్లు ఆయన వెల్లడించారు. కొత్త పారిశ్రామిక పాలసీకి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించిందని, నోటిఫికేషన్ విడుదల చేసినట్లుగా కేజ్రీవాల్ తెలిపారు. ఇది చారిత్రాత్మక నిర్ణయంగా కేజ్రివాల్ అభివర్ణించారు.
ఈ సంధర్భంగా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా సేవ మరియు హైటెక్ పరిశ్రమలపై ఆధారపడి ఉందని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో సేవా పరిశ్రమను తక్కువ ధరకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం దేశ రాజధానిలోని కాలుష్య సమస్య. కాలుష్యానికి కారణమయ్యే ఉత్పాదక యూనిట్లను సేవ మరియు హైటెక్ పరిశ్రమలుగా మార్చడానికి అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
వాస్తవానికి, ఢిల్లీలో వాయు కాలుష్యం సమస్య తీవ్రమైన రూపాన్ని సంతరించుకుంటోంది. ప్రతి సంవత్సరం శీతాకాలంలో ఢిల్లీ గాలి విషపూరితంగా మారుతుంది. ఇప్పటికే వాతావరణం కాలుష్యం తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే కొత్త పారిశ్రామిక ప్రాంతాలలో హైటెక్ పరిశ్రమలు మరియు సేవా పరిశ్రమలను మాత్రమే ఏర్పాటుకు అనుమతులు ఇస్తుంది అక్కడి ప్రభుత్వం.