Covid Children : గుడ్‌న్యూస్.. థర్డ్ వేవ్‌లో పిల్లలకు ముప్పు తక్కువే

కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలకు ముప్పు పొంచి ఉందనే నిపుణుల హెచ్చరికలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. చిన్నపిల్లల

Covid Children

Covid Children : కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలకు ముప్పు పొంచి ఉందనే నిపుణుల హెచ్చరికలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. చిన్నపిల్లల తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. రానున్న ముప్పుని తలుచుకుని నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ద లాన్సెట్ జర్నల్ ఆధ్వర్యంలో చేపట్టిన అధ్యయనంలో కీలక విషయాలు వెలుగుచూశాయి.

కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలకు ముప్పు ఉంది అనడానికి తగిన ఆధారాలు లేవని ద లాన్సెట్ జర్నల్ ఆధ్వర్యంలో చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ మేరకు ఓ నివేదిక ప్రకటించారు. ”పిల్లలకే ముప్పు ఎక్కువని, వారే ఎక్కువగా ప్రభావితమవుతారని, వారికే తీవ్ర ఇన్ఫెక్షన్లు సోకుతాయని చెప్పేందుకు తగిన ఆధారాలు దొరకలేదు. అందరిలాగే వారికీ ప్రమాదం ఉంటుంది. ఎక్కువమంది జ్వరం, శ్వాస, విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి వంటి సమస్యల బారిన పడతారు. కానీ కరోనా వైరస్ లక్షణాలు స్వల్పంగా కనిపిస్తాయి” అని నిపుణులు తెలిపారు.

ఢిల్లీ ఎయిమ్స్‌ సహా దేశంలోని పలు ప్రముఖ ఆస్పత్రులకు చెందిన పిల్లల వైద్య నిపుణులతో ‘ద లాన్సెట్‌’ ఏర్పాటుచేసిన ‘కొవిడ్‌-19 కమిషన్‌ ఇండియా టాస్క్‌ఫోర్స్‌’ అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. కొవిడ్‌ లక్షణాలు బయటపడే తీరులో ఇతర దేశాల పిల్లలకు, భారత్‌లోని బాలలకు పెద్ద తేడా ఏమీ లేదని నివేదిక తేల్చి చెప్పింది. కొవిడ్‌ బారిన పడే పిల్లల్లో ఎక్కువమందిలో ఇన్ఫెక్షన్‌ లక్షణాలు బయటికి కనిపించడం లేదని, ఒకవేళ లక్షణాలు బయటపడినా తేలికపాటి ఇన్ఫెక్షనే ఉంటోందని తెలిపింది.

ప్రధానంగా జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జీర్ణాశయ సమస్యలు, అతిసారం, వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలు కొవిడ్‌ సోకిన పిల్లల్లో కనిపిస్తున్నాయంది. ఇన్ఫెక్షన్‌ లక్షణాలు బయటికి కనిపించే రేటు ఎక్కువ వయసున్న పిల్లల్లో ఎక్కువగానూ, తక్కువ వయసున్న పిల్లల్లో తక్కువగానూ ఉంటోందని ‘లాన్సట్‌ టాస్క్‌ఫోర్స్‌’ నివేదిక వివరించింది. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ -ఎన్‌సీఆర్‌ల పరిధిలోని పది ఆస్పత్రుల్లో(ప్రభుత్వ, ప్రైవేటు) కొవిడ్‌ చికిత్స పొందిన పదేళ్లలోపు 2,600 మంది పిల్లల ఆరోగ్య నివేదికలను సేకరించి విశ్లేషించగా ఈ అంశాలు వెలుగుచూశాయని వివరించింది. కరోనా మూడోవేవ్ లో పిల్లలకు పెనుగండం అంటూ ప్రచారం జరుగుతున్న తరుణంలో ద లాన్సెట్ విడుదల చేసిన నివేదిక ఊరటనిచ్చేలా ఉంది.