నాణాలతో నామినేషన్:‘జేబులో డబ్బులు లేవు, పైపులో నీళ్లు లేవు

దుర్గ్: దేశవ్యాప్తంగా జరగనున్న ఎన్నికలు పలు చిత్ర విచిత్రాలకు వేదికలవుతున్నాయి. వినూత్న ప్రచారాలు..వింత నిరసనలు ఎన్నో చూశాం.కానీ లోక్ సభకు పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే క్రమంలో చిల్లర నాణాలతో కలెక్టర్ ఆఫీస్ కు చేరుకున్న వినూత్న ఘటన ఛతీస్ గఢ్ లో చోటుచేసుకుంది. మట్టి కుండలను భుజాన మోస్తూ కొంతమంది వ్యక్తులు ఆ జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడున్నవారంతా వారిని ఆశ్చర్యంగా చూశారు. ఇదేంటి ఇన్ని కుండల్ని మోసుకొస్తున్నారని..పైగా ఆ కుండలపై రాసి వున్న ఈ కుండలపై అతికించి ఉన్న పాంప్లెట్స్‌ను ఆసక్తిగా తిలకించారు.
‘జేబులో డబ్బులు లేవు, పైపులో నీళ్లు లేవు, ఇదే పేదల కథ’ అని రాసి ఉన్న కరపత్రాలను కుండలపై అతికించారు. వారంతా మోసుకొచ్చిన మట్టికుండల్లో రూ. 25 వేల నాణాల్ని నింపారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ సీటు లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న తివారి కుండల్లోని చిల్లర నాణాలను ఇచ్చి (చెల్లించి) తన నామినేషన్ దాఖలు చేశారు జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న తివారి. కాగా గ్రామస్థులంతా కూడా తివారికి మద్దతుగా నిలిచి ఎవరికి తోచినవి వారు ఆ మట్టికుండల్లో రూపాయి నుంచి 10 రూపాయల వరకూ విరాళంగా ఇవ్వటమే కాక వారే స్వయంగా వాటిని మోసుకొచ్చారు.
ఈ క్రమంలో ఈ నాణాలను లెక్కపెట్టేందుకు అధికారులు నానా యాతన పడ్డారు. చత్తీస్‌గఢ్‌లో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 11, 18, 23 తేదీల్లో జరగనున్నాయి. నోట్ల కట్టలతో నామినేషన్ వేసే ప్రస్తుత నాయకులు ఉన్న తరుణంలో కేవలం గ్రామస్థులు ఇచ్చిన విరాళాలతో పైగా..చిల్లర నాణాలతో నామినేషన్ వేయటం విశేషమే కదా.