లక్షల లీటర్ల బీరు డ్రైనేజీపాలు.. విలవిలలాడిన మందుబాబుల హృదయాలు

  • Published By: Mahesh ,Published On : April 28, 2020 / 08:03 AM IST
లక్షల లీటర్ల బీరు డ్రైనేజీపాలు.. విలవిలలాడిన మందుబాబుల హృదయాలు

Updated On : April 28, 2020 / 8:03 AM IST

లాక్ డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మద్యం షాపులు బంద్ అయ్యాయి. దీంతో మందుబాబులు విలవిలలాడిపోతున్నారు. మద్యం దొరక్క పిచ్చోళ్లు అవుతున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. డబ్బున్న వాళ్లు బ్లాక్ లో అధిక ధరలకు మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఏదో ఒక విధంగా మద్యం దాహం తీర్చుకుంటున్నారు. లాక్ డౌన్ వేళ ఇవీ మందుబాబుల కష్టాలు. కాగా లక్షల లీటర్ల ఫ్రెష్ బీరు డ్రైనేజీ పాలైంది అనే వార్త తెలిసి మందుబాబులు తెగ ఫీల్ అయిపోతున్నారు. అయ్యో అయ్యో అని గుండెలు బాదుకుంటున్నారు. వారి హృదయాలు విలవిలలాడిపోతున్నాయి. అసలు లక్షల లీటర్ల బీరు అలా నేలపాలు కావడానికి కారణం ఏంటంటే లాక్ డౌన్.

బీరును మెయింటేన్ చెయ్యడం తలకు మించిన భారం:
అవును లాక్ డౌన్ కారణంగానే లక్షల లీటర్ల ఫ్రెష్ బీరు నేలపాలైంది. మ్యాటర్ ఏంటంటే, తాము ఉత్పత్తి చేసిన బీరును మెయింటేన్ చెయ్యడం తలకు మించిన భారం అవుతోందంటూ… ఢిల్లీలోని నేషనల్ కేపిటల్ రీజియన్ లో 50కి పైగా బీర్ తయారీ సంస్థలు… తమ దగ్గరున్న లక్షల లీటర్ల ఫ్రెష్ బీర్‌ను డ్రైనేజీలో పార బోసేందుకు సిద్ధమవుతున్నాయి. ఆల్రెడీ గుర్గావ్‌ (ఢిల్లీకి 40 కిలోమీటర్ల దూరం)లో ప్రాంక్‌స్టర్, సాయ్7, స్ట్రైకర్ బీర్ తయారీ సంస్థలు… 8వేల లీటర్ల బీర్‌ను నేలపాలు చేశాయి. మరికొన్ని బ్రూవరీలు అదే పనిలో ఉన్నాయి.

బాటిల్ లో బీర్ ఎక్కువ కాలం నిల్వ ఉండదు:
మార్చి 23న ప్రధాని నరేంద్ర మోడీ సడెన్ గా దేశవ్యాప్త లాక్‌ డౌన్ ప్రకటించారు. కాగా అప్పటికే బ్రూవరీలు… పెద్ద ఎత్తున బీర్‌ను ఉత్పత్తి చేసి స్టాక్ పెట్టుకున్నాయి. అయితే బాటిల్ లో బీర్ ఎక్కువ కాలం నిల్వ ఉండదు. ఫ్రెష్‌గా తయారు చేసిన బీర్‌ను నిల్వ ఉంచేందుకు ప్రత్యే ఉష్ణోగ్రతలో ఉంచుతారు. ఇలా ఉంచడానికి చాలా డబ్బు ఖర్చవుతుంది. సేల్స్ ఉన్నా, లేకపోయినా… ప్లాంట్ పనిచేయాల్సి ఉంటుంది.

బీర్ బాటిళ్లు మెయింటేన్ చెయ్యలేక నష్టాలు:
ఇటీవల కేజ్రీవాల్ ప్రభుత్వం… మద్యం షాపులు మళ్లీ తెరిపించాలనే ఆలోచనకు రావడంతో… ఖర్చైనా పర్వాలేదనుకుంటూ…. బ్రూవరీలు… కొత్త బీర్‌ను మెయింటేన్ చేస్తూ వచ్చాయి. అయితే… కేజ్రీవాల్ ప్రభుత్వం అడుగులు ముందుకు వెయ్యకపోవడంతో… తమకు నష్టాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయనీ… ఇక ఆ బీర్‌ను మెయింటేన్ చెయ్యడం తమ వల్ల కాదంటున్న బ్రూవరీలు… దాన్ని పారబోస్తున్నాయి. నిర్వహణ ఖర్చులు మాత్రమే కాదు… ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజు చెల్లించాలి, ఇతర పన్నులు కూడా తప్పవు. ఇవన్నీ భరించేకంటే… ఆ బీర్‌ను పారేయడమే బెటరంటున్నాయి బ్రూవరీలు. ఇది తెలుసుకున్న మందుబాబులు… అయ్యో… అలా పారబోసే బదులు మా నోట్లో పోసినా పోయేది కదా అని వాపోతున్నారట.