Operation Trident: డ్రగ్స్ మాఫియాపై కేంద్రం సర్జికల్ స్ట్రైక్.. 38 చోట్ల ‘ఆపరేషన్ ట్రైడెంట్’ దాడులు.. 18 మంది స్మగ్లర్ల అరెస్ట్
కేంద్ర హోంశాఖ చేపట్టిన 'ఆపరేషన్ ట్రైడెంట్(Operation Trident)' ద్వారా 38 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిపి 18 మంది అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.
Operation trident busted international drug cartel in northeast 18 arrested
Operation Trident: భారతదేశాన్ని ‘డ్రగ్స్ రహిత భారత్’గా మార్చే లక్ష్యంతో కేంద్ర హోంశాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ ట్రైడెంట్’ (Operation Trident) భారీ విజయాన్ని సాధించింది. భారత్-మయాన్మార్-బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా సాగుతున్న అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను తుడిచిపెట్టేందుకు కేంద్ర ఏజెన్సీలతో పాటు ఈశాన్య రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా ఈ సుదీర్ఘ ఆపరేషన్ నిర్వహించారు. 2029 డిసెంబర్ 31 నాటికి దేశంలో డ్రగ్స్ రవాణాకు పూర్తిగా చరమగీతం పాడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ విరోచిత చర్యలకు శ్రీకారం చుట్టింది.
3 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు.. రూ.100 కోట్ల హవాలా గుట్టురట్టు:
ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా మణిపూర్, అసోం, మిజోరం రాష్ట్రాల్లోని 38 సున్నితమైన ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఏకకాలంలో విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో అంతర్జాతీయ డ్రగ్స్ కార్టెల్‌కు చెందిన 18 మంది ప్రధాన స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా, ఈ నెట్వర్క్ వెనుక ఉన్న దాదాపు రూ.100 కోట్ల హవాలా లావాదేవీల గుట్టును రట్టు చేయడమే కాకుండా, దానికి సంబంధించిన 1,424 బ్యాంక్ ఖాతాలను అధికారులు తక్షణమే సీజ్ చేశారు.
500 డిటొనేటర్ల స్వాధీనం.. విద్రోహ చర్యల కుట్ర సైతం భగ్నం:
అరెస్టు చేసిన స్మగ్లర్ల నుంచి డ్రగ్స్‌తో పాటు 500 డిటొనేటర్లను అధికారులు స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. డ్రగ్స్ విక్రయాల ద్వారా వచ్చే సొమ్మును విధ్వంసకర కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారనే అనుమానాలకు ఈ రికవరీ బలమైన నిదర్శనంగా నిలిచింది. సరిహద్దుల్లో చొరబాట్లను అరికట్టడంతో పాటు డ్రగ్స్ మూలాలను కట్ చేయడమే ధ్యేయంగా కేంద్రం ఈ తీవ్రమైన చర్యలు కొనసాగిస్తోంది.
