Politics in India: కేంద్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా ఆ నలుగురు.. అంతుచిక్కని రాజకీయం

ఈ నలుగురు కేంద్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారుతున్నారు. కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న నితీశ్ ఆగర్భ శత్రువు కాంగ్రెస్‌తో జట్టుకట్టడానికి తెగ ఉబలాటపడుతున్నారు.

Politics in India: దేశరాజకీయాల్లో విలువలకు ఇప్పుడు ఏమాత్రం విలువ లేదనే విషయం అర్థమవుతోంది. నేతల తీరు చూస్తే అసలు నైతిక విలువలకు ఏనాడో తిలోదకాలు ఇచ్చారనే విషయం అర్థమవుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు నేతల తీరు ఇలాగే మారిపోయింది. ఇప్పుడు కేంద్ర రాజకీయాల్లో జరుగుతున్న మార్పులు, కన్నడ నాట జరుగుతున్న ఎన్నికలను చూస్తే రాజకీయ నాయకులు సిద్ధాంతాలకు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదనే విషయం అర్థమవుతుంది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమే ఇప్పుడు రాజకీయ నేతల లక్ష్యంగా మారిపోయింది. ఎన్ని కండువాలు మారిస్తే అంత సీనియర్. ఎన్ని పార్టీలు మారితే అంత విలువ అన్నట్టుగా మారిపోయింది. ఇలాంటి రాజనీతిని ఒంటబట్టిచ్చుకున్న దేశముదురు రాజకీయ నేతలు మన దేశంలో చాలా మందే ఉన్నారు.

రాజకీయం అంటేనే అంతుచిక్కని పోరాటం. ప్రజానాడి ఎలా ఉంటుందో తెలుసుకోవడమే కాదు.. ఆ ప్రజలు ఎన్నుకున్న నేతల అంతరంగం అర్థం చేసుకోవడమూ పెద్ద పరీక్షే. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నట్లు.. మన నేతల మాటలకూ మీనింగ్స్ వేరేగా ఉంటాయి. సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటున్న కొందరు కీలక నేతల వైఖరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో జట్టుకడుతున్నాయి విపక్ష పార్టీలు. ఇలా జట్టు కడుతున్న వారి వైఖరి రాజకీయంగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

విడివిడిగా కాదు కలివిడిగా కొట్టేద్దాం
రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఉప్పు-నిప్పుగా ఉన్నవారు ఆకస్మికంగా యుగళగీతాలు ఆలపిస్తున్నారు. విడివిడిగా కాదు కలివిడిగా కొట్టేద్దాం అంటూ చేతులు కలుపుతున్నారు. తమతో కలిసొచ్చే దెవరు? మోదీని గద్దె దింపెదెవరు? అంటూ బాహుబలి రేంజ్‌లో డైలాగ్‌లు విసురుతున్నారు. కేంద్రంలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టకున్న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్(Nitish Kumar), బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్, బీఎస్‌పీ అధినేత్రి మాయావతి. ఈ నలుగురు కేంద్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారుతున్నారు. కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న నితీశ్ ఆగర్భ శత్రువు కాంగ్రెస్‌తో జట్టుకట్టడానికి తెగ ఉబలాటపడుతున్నారు.

కేంద్ర రాజకీయాల్లో నితీశ్ వ్యవహారం తాజా సంచలనంగా మారింది. సుదీర్ఘంగా కాంగ్రెస్‌పై పోరాడిన సోషలిస్టు నేతగా నితీశ్‌కు ఎంతో గుర్తింపు ఉంది. కానీ, గత ఏడాది ఆగస్టుతో బీజేపీతో కలహించి మరో శత్రువు ఆర్జేడితో జట్టుకట్టారు నితీశ్. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లు బీజేపీకి శత్రుపక్షమైన కాంగ్రెస్‌తో స్నేహం చేసి తన ముఖ్యమంత్రి పదవికి ముప్పు లేకుండా చేసుకున్నారు. కేంద్రంలో నితీశ్ మద్దతు అవసరం కావడంతో కాంగ్రెస్ కూడా నితీశ్‌ను అక్కున చేర్చుకుంది. అయితే ఇన్నాళ్లు ఈ పొత్తు బిహార్ వరకు మాత్రమే పరిమితమైంది. వచ్చే ఎన్నికల తర్వాత ప్రధాని కావాలని కలలు కన్న నితీశ్ కేంద్రంలో కాంగ్రెస్‌కు దూరంగా ఉన్నారు. గత ఏడాది ఆగస్టులో బీజేపీకి విడాకులిచ్చి బయటకు వచ్చిన నితీశ్ ఆ తర్వాత సెప్టెంబర్‌లో ఢిల్లీకి వచ్చారు. మళ్లీ ఏడు నెలల తర్వాత ఢిల్లీ టూర్ వేసిన ఈ సీనియర్ సోషలిస్టు నేత.. ఏకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge)తో సమావేశమై దేశంలో ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేస్తానని ప్రకటించడం సంచలనం అయింది.

నితీశ్ వైఖరిలో ఆకస్మిక మార్పు
కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలను సమీకరించి తాను ప్రధాని అభ్యర్థిగా పోటీ చేయాలని ఇన్నాళ్లు భావించిన నితీశ్ వైఖరిలో ఈ ఆకస్మిక మార్పు హాట్‌టాపిక్‌గా మారింది. ఎన్డీఏ, యూపీఏలకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే నితీశ్ ప్రతిపాదనకు ఆయనే సమాధి చేసి.. ఇప్పుడు యూపీఏ భాగస్వామ్య పక్షంగా చేరేందుకు సిద్ధమవడం.. యూపీఏ బలోపేతం దిశగా దేశంలో బీజేపీయేతర పక్షాలతో మాట్లాడే బాధ్యతలు తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. తన అధికారం కోసం కుదిరితే ఒకలా.. లేకుంటే మరోలా మారిపోయే నితీశ్ రాజకీయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. బిహార్‌లో లాలూ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్‌తో వైరాన్ని పక్కనపెట్టి ఆ పార్టీ మద్దతుతో సీఎంగా కొనసాగడమే నితీశ్ మార్కు రాజకీయం అనుకున్నారంతా. ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ని కలిసి 2024 సార్వత్రిక బాధ్యతలను భుజానికి ఎత్తుకోవడంలో నితీశ్ ఆంతర్యమేమిటో అర్థం చేసుకోలేక రాజకీయ పండితులు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఇదే కసితో 2024 వరకు నితీశ్ ఉంటారా? కాంగ్రెస్‌తో స్నేహం కొనసాగిస్తారంటే.. దానికీ పూర్తి గ్యారెంటీ చెప్పలేమంటున్నారు పరిశీలకులు.

నితీశ్ వ్యవహారం ఇలా వుంటే.. ఇన్నాళ్లు కాంగ్రెస్‌తో చట్టాపట్టాల్ వేసుకుని తిరిగిన మరాఠా వృద్ధనేత శరద్‌పవార్ యూపీఏ పార్టీలు జలదరించేలా ఝలక్ ఇచ్చారు. మోదీ మ్యానియా నుంచి బయటపడి నితీశ్ వంటివారు కాంగ్రెస్‌కు దగ్గరవుతుంటే.. ఉన్నట్టుండి శరద్‌పవార్ ప్రధాని మోడీకి అనుకూలంగా ప్రకటనలు చేస్తూ కాకరేపుతున్నారు. పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా విపక్షాలన్నీ అదానీ వ్యవహారంపై పట్టుబిగిస్తే… అబ్బే ఇలాంటి పోరాటాల వల్ల దేశ ఆర్థికాభివృద్ధికే నష్టమంటూ తేల్చేశారు పవార్. ప్రధాని మోదీ విద్యార్హతలపై చర్చను నీరుగార్చేలా ప్రకటన చేసి విపక్ష శిబిరాన్ని దెబ్బతీశారు పవార్. ఇంత చేసీ విపక్ష ఐక్యత కోసం పనిచేస్తానంటూ ఆయన ప్రకటన చేయడం.. జాయింట్ పార్లమెంట్ కమిటీ లీడర్‌గా శరద్‌పవార్ మంచి సేవలు అందించారని బీజేపీ ఆ వెంటనే ప్రశంసించడం ఎన్నో అనుమానాలకు దారితీసింది. ముఖ్యంగా శరద్‌పవార్‌ను నమ్ముకుని బీజేపీతో తెగతెంపులు చేసుకున్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు కలవరానికి గురిచేసింది. శరద్ ప్లేట్ ఫిరాయిస్తే తాను ఒంటరైపోతాననే ఆందోళనతో స్వయంగా పవార్‌ను కలిసి అసలు విషయమేమిటో తెలుసుకోవాలని అనుకున్నారు ఉద్ధవ్ ఠాక్రే. ఇదే విషయంలో కాంగ్రెస్ కూడా గందరగోళానికి గురవుతోంది. ఇన్నాళ్లు అత్యంత ఆప్తుడిగా ఉన్న పవార్‌లో ఒక్కసారిగా వచ్చిన మార్పుతో కాంగ్రెస్ అగ్రనేతలు కంగుతిన్నారు.

అనుమానాస్పదంగా మాయావతి అడుగులు
ఇక ఎప్పటికైనా ప్రధాని కావాలనే జీవితాశయం పెట్టుకున్న బీఎస్‌పీ అధినేత్రి మాయావతి(Mayawati) అడుగులు అనుమానాస్పదంగానే ఉన్నాయి. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీకి నాలుగుసార్లు సీఎంగా పనిచేశారు మాయావతి. కలెక్టర్ కాబోయి పొలిటీషియన్ అయిన బెహన్‌ జీ కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లు షాక్‌లిస్తూ రాజకీయంగా ఎదిగారు. యూపీలో యోగీ హవాతో మాయావతి వెనబడినా.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఓట్లు చాలా కీలకం. బీఎస్‌పీ, సమాజ్‌వాదీ, బీజేపీ.. మూడు పార్టీలు మూడు కూటములుగా ఎన్నికల్లో తలపడుతున్నాయి. అయితే ఈ సారి బీజేపీని గద్దె దించాలంటే దేశంలో పెద్ద రాష్ట్రమైన యూపీలో బీజేపీని కట్టడి చేయాల్సివుంటుంది. బీఎస్‌పీ, సమాజ్‌వాది వేర్వేరుగా పోటీ చేస్తే బీజేపీకి లాభించే అవకాశం ఉంది. ఈ లెక్కలన్నీ చూసిన బిహార్ సీఎం నితీశ్ మాయావతితో మధ్యవర్తిత్వం నెరిపే బాధ్యత తీసుకున్నారు.

బీజేపీ వ్యతిరేకంగా విపక్షాల నుంచి ఒకే పార్టీ అభ్యర్థి ఉండాలని ప్రతిపాదిస్తున్న నితీశ్.. యూపీలో బీఎస్‌పీ, సమాజ్‌వాది వేర్వేరుగా పోటీ చేస్తే దెబ్బతింటామని భయపడుతున్నారు. సమాజ్‌వాది నేత అఖిలేశ్‌తో మాయవతికి సయోధ్య కుదిర్చి యూపీఏలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అయితే మాయవతి వ్యవహారశైలి కోసం తెలిసిన వారు అది కుదిరే పనేనా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 1999లో వాజ్‌పేయి ప్రభుత్వం పతనం కావడానికి మాయావతి పోషించిన పాత్ర గుర్తు చేస్తున్నారు. పార్లమెంట్‌లో వాజ్‌పేయి ప్రభుత్వ విశ్వాస పరీక్షకు ముందురోజు తాము ఓటింగ్‌కు దూరంగా ఉంటామని, ధీమాగా ఉండమని వాజ్‌పేయికి భరోసా ఇచ్చిన బెహన్జీ రాత్రికిరాత్రే మనసు మార్చుకున్నారు. ఆమె ఎప్పుడు ఎలా మారతారో తెలియదని సొంత పార్టీ నేతలే అంటుంటారు. ఇప్పుడు నితీశ్ చాణక్యంతో మాయావతి కాంగ్రెస్‌కు అనుకూలంగా మారినా.. ఎన్నికల నాటికి మనసు మార్చుకునే అవకాశం కూడా ఉందంటున్నారు. ఈ ముగ్గురి నేతల దారిలోనే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా అవసార్థం.. అవకాశవాద రాజకీయాలు చేస్తుంటారనే విమర్శలు ఉన్నాయి. ఇక కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సంగతి వేరేగా చెప్పాలా.. పట్టుమని పదిమంది ఎమ్మెల్యేలతోనైనా తాను చక్రం తిప్పాలని కోరుకుంటుంటారు కుమారస్వామి. హంగ్ రావాలి.. కింగ్ కావాలనేది ఆయన సిద్ధాంతం. పదవి కోసం ఎవరితోనైనా కలిసిపోయే మహా నేర్పరి కుమారస్వామి.

రాజకీయాల్లో మమత మాయాజాలం
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) కూడా రాజకీయ సంచలనాలకు కేరాఫ్‌గా చెబుతారు. బెంగాల్‌లో కమ్యూనిస్టుల సుదీర్ఘ పాలనకు తెరవేసి అధికారంలోకి వచ్చిన దీదీ.. కొన్నాళ్లు కాంగ్రెస్‌తో మరికొన్నాళ్లు బీజేపీతో కలిసి నడిచారు. ఇప్పుడు తన అధికార పీఠం లాగేయాలని చూస్తున్న బీజేపీకి దెబ్బతీయడానికి కాంగ్రెస్‌తో స్నేహం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక కర్ణాటకలో కుమారస్వామి రాజకీయం ఆసక్తికరంగా మారింది. కుమారస్వామి కూడా గతంలో రెండు జాతీయ పార్టీలతో జట్టుకట్టిన వారే.. ఇప్పుడు సొంతంగా పోటీ చేస్తున్నా.. ఎన్నికలయ్యాక అధికారం కోసం ఆయన ఏదో ఒక కూటమి గూటికి చేరుతారనే అంచనాలు ఉన్నాయి.

Also Read: చూసుకుందాం అంటే చూసుకుందాం.. సీఎం స్టాలిన్‭కు తమిళనాడు బీజేపీ చీఫ్ సవాల్

అధికారం కోసం రంగులు మార్చడం పాలిటిక్స్‌లో అత్యంత సహజం. కాకపోతే జాతీయ నాయకులుగా చలామణీ అయ్యే నేతలు ఎప్పటికప్పుడు ప్లేట్ ఫిరాయించడమే విచిత్రంగా అనిపిస్తుంది. తరచూ పొలిటికల్ స్టాండ్ మార్చే నేతల్లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ముందువరసలో ఉంటారు. కాంగ్రెస్‌తో విభేదించి సొంతపార్టీ పెట్టుకున్న మమత.. బెంగాల్‌లో కమ్యూనిస్టులతో సుదీర్ఘ పోరాటం చేశారు. 1997లో తృణమూల్ కాంగ్రెస్‌ (Trinamool Congress)ను స్థాపించిన మమత.. 1999లో బీజేపీతో కలిసి కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత బీజేపీతో విభేదించి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకి మద్దతు పలికి ఆ ప్రభుత్వంలోనూ మంత్రి బాధ్యతలు చేపట్టారు. సొంతరాష్ట్రంలో వాపపక్షాలతో పోరాడుతూనే కేంద్రంలో వామపక్షాల భాగస్వామిగా యూపీఏలో రాజకీయం చేశారు మమత. ఇదంతా గతం. ఇప్పుడు బెంగాల్‌లో సీన్ మారింది. కమ్యూనిస్టుల బలం తగ్గిపోయింది. అయితే ఆ లోటు భర్తీ చేస్తూ దీదీకి సవాల్ విసురుతోంది బీజేపీ.

తనను టార్గెట్‌గా చేసుకున్న కేంద్ర ప్రభుత్వంపై ఇన్నాళ్లు ఒంటరిగా పోరాడిన మమత ఇప్పుడు ఆకస్మికంగా మనసు మార్చుకున్నారు. కొంతకాలంగా బెంగాల్‌లో కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న మమత.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీచేస్తామని ప్రకటించారు. ప్రధాని మోదీ కాంగ్రెస్ నేత రాహుల్‌ను టార్గెట్ చేస్తున్నారని.. రాహుల్‌ కేంద్రంగా నడుస్తున్న రాజకీయంలో తాము చేరి నష్టపోవాల్సిన పనిలేదని చెప్పిన మమత.. తన రూటే సెపరేటంటూ ప్రకటనలిచ్చేవారు. కానీ, ఈ మధ్య మళ్లీ మనసు మార్చుకుని కాంగ్రెస్‌ కూటమిలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. వామపక్షాలు, తృణమూల్ వేర్వేరుగా పోటీ చేస్తే బెంగాల్‌లో బీజేపీకి చాన్స్ ఇచ్చే పరిస్థితి వస్తుందని.. అంతిమంగా అది తన అధికారానికి ఆటంకంగా మారే అవకాశం ఉందని భయపడిన మమత ఆకస్మికంగా కాంగ్రెస్‌తో కలిసిపోయేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

పదవి కోసం ఎవరితోనైనా కలవటానికి సిద్దమే..
ఇక కర్ణాటక పాలిటిక్స్‌లో కుమారస్వామి(Kumaraswamy) రాజకీయాలకు సరికొత్త అర్థాలు చెబుతున్నారు. రెండు సార్లు సీఎంగా పనిచేసిన కుమారస్వామి ఎప్పుడూ ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకోలేదు. ముఖ్యమంత్రి పదవి కోసం ఎప్పుడైనా ఎవరితోనైనా కలవటానికి కుమారస్వామి సిద్ధంగా ఉంటారు. సిద్ధాంతాలు.. విలువలు వంటి పెద్దపెద్ద మాటలకు కుమారస్వామి వద్ద స్థానమే ఉండదని అంటుంటారు ఆయన అనుచరులు. 2006లో తొలిసారి ముఖ్యమంత్రి కావడానికి యడియూరప్ప ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్‌కు మద్దతు పలికిన కుమారస్వామి.. ఆ పార్టీని గద్దె దించారు.

Mallikarjun kharge: ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ..

తాను ముఖ్యమంత్రిగా కొన్నాళ్లు పనిచేశాక 2007లో కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసి బీజేపీకి మద్దతు ప్రకటించారు. కేవలం నెల రోజుల్లోనే బీజేపీతో విభేదించి రాష్ట్రపతి పాలన వచ్చేలా చేశారు. 2018లో రెండోసారి ముఖ్యమంత్రి కాడానికి ప్రయత్నించిన కుమారస్వామి.. బీజేపీకి హ్యాండిచ్చి కాంగ్రెస్‌తో జట్టు కట్టారు. ఏడాదిపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. తన పదవి కోసం ఏం చేయడానికైనా సిద్ధమని నిరూపించారు కుమారస్వామి. ఇప్పుడు కూడా కర్ణాటక(Karnataka) రాజకీయాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించాలని ఆయన పోటీ చేయడం లేదు. తన పార్టీకి తక్కువ సీట్లు వచ్చినా.. చక్రం తిప్పేలా అవకాశం ఉండాలనే కోరుకుంటున్నారు. హంగ్ వస్తే.. తానే కింగ్ అంటూ కలలు కంటున్నారు కుమారస్వామి.

ఈ ఐదుగురు నేతలే కాదు.. దేశంలో చాలా మంది నేతలు విలువలకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా రాజకీయాలు చేస్తున్నారు. తమ స్వప్రయోజనాల కోసం ఎప్పటికప్పుడు రంగులు మార్చుతున్నారు. చెప్పేదొకటి.. చేసేదొకటి.. వారి చేష్టలతో ఎప్పుడు ఏం జరుగుతోందో.. ఎవరు ఎవరితో కలుస్తారో? ఎవరిని వదిలేస్తారో? తెలియడం లేదు. నేతలు కలవడానికి ఓ ప్రాతిపాదక ఉండదు. విడిపోవడానికి కారణమూ ఉండదు. స్వప్రయోజనం ఉంటే చాలు ఎలాగైనా మార్చుకోవచ్చుననేది మన నేతల థియరీ.

ట్రెండింగ్ వార్తలు