Parliament Special Session 2026 : చరిత్రాత్మక ఘట్టానికి నేడే శ్రీకారం.. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్తో సహా లోక్సభ ముందుకు 3 కీలక బిల్లులు
Parliament Special Session 2026 : మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పెంపు, పునర్విభజన బిల్లులపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం అయ్యింది.
Parliament Special Session 2026 women reservation and delimitation bill in lok sabha
Parliament Special Session 2026 : దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పే చరిత్రాత్మక ఘట్టానికి నేడే శ్రీకారం చుట్టేందుకు గురువారం పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలకు, డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాల పెంపు, పునర్విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను లోక్సభ ముందుకు తీసుకొచ్చింది. ఏప్రిల్ 16, గురువారం ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైన తర్వాత.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వీటిని ప్రతిపాదించారు. అనంతరం వీటిని సభలో ప్రవేశపెట్టేందుకు చర్చ చేపట్టారు. అయితే విపక్షాలు ఈ బిల్లులను వ్యతిరేకించి డివిజన్ ఓటింగ్ కి పట్టుబట్టాయి. దీంతో స్పీకర్ ఓం బిర్లా అందుకు అనుమతిచ్చారు.
విపక్షాల కోరిక మేరకు డివిజన్ ఓటింగ్ నిర్వహించగా.. ఈ మూడు బిల్లులను ప్రవేశపెట్టేందుకు మద్దతుగా 251 ఓట్లు పోలవ్వగా.. 185 మంది దీనికి వ్యతిరేకంగా ఓటేశారు. మెజార్టీ ఓట్లు రావడంతో.. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కేంద్రం ఈ మూడు బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులపై సభలో చర్చించేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. ఏప్రిల్ 17, శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వీటిపై ఓటింగ్ నిర్వహించనున్నట్లు సభాపతి తెలిపారు.
ప్రవేశపెట్టిన మూడు బిల్లుల వివరాలు:
- లోక్సభ సీట్లను 550 నుంచి గరిష్ఠంగా 850కి పెంచడం.
- 2011 జనాభా లెక్కల ప్రకారమే దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టేలా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు.
- లోక్సభ-అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు అవసరమైన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన మరో బిల్లు.
వీటిపై లోక్సభలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఈ బిల్లులపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం లోక్సభలో ప్రసంగిస్తారు. ఈ మూడింటిలో డీలిమిటేషన్ రాజ్యాంగ సవరణ బిల్లు కాగా, మిగతా రెండూ చట్టపరమైన బిల్లులు.
ఆమోదం పొందేందుకు కావాల్సిన మెజారిటీ:
- రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంటులో మూడింట రెండొంతుల (2/3) మెజారిటీ కావాలి. అంటే ప్రస్తుతం లోక్సభలో ఉన్న 540 మంది సభ్యుల్లో 360 మంది సభ్యుల మద్దతు అవసరం.
- మిగతా రెండు చట్టపరమైన బిల్లుల ఆమోదానికి సాధారణ మెజారిటీ సరిపోతుంది.
ప్రస్తుతం అధికార ఎన్డీయే కూటమికి 292 మంది సభ్యుల మద్దతు ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి మరో 68 మంది మద్దతు అవసరం. అయితే ఇండియా కూటమి ఈ డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తున్నామని, దీనికి వ్యతిరేకంగా ఓటేస్తామని స్పష్టం చేయడంతో ఈ బిల్లుల ఆమోదంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
