Farm Laws Repeal : పాలిటిక్స్ కే ప్రాధాన్యం..సాగు చట్టాల రద్దుతో బీజేపీ ప్రయోజనం ఉండదన్న సుప్రీం కమిటీ సభ్యుడు

మూడు సాగు చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఏడారి ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎలాంటి ప్రయోజనం చేకూరదని వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు

Modi (1)

Farm Laws Repeal :  మూడు సాగు చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వచ్చే ఏడారి ప్రారంభంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎలాంటి ప్రయోజనం చేకూరదని వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు, శెత్కారీ సంఘటన అధ్యక్షుడు అనిల్ ఘన్వాట్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల వరకు నిరసన కొనసాగించాలని రైతులు నిర్ణయించుకున్నారన్న ఘన్వాట్.. ఆందోళన తారస్థాయికి చేరినప్పుడు స్పందించని కేంద్రం, ఇప్పుడు వారికి తలవంచిందని వ్యాఖ్యానించారు. రాజకీయ కోణంతో తీసుకున్న ఈ నిర్ణయంతో రైతుల ఆందోళన ఆగిపోదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎలాంటి ప్రయోజనం చేకూరదని జోస్యం చెప్పారు.

సమస్య పరిష్కారం కోసం చట్టాలను ఉపసంహరించడానికి బదులు ఇతర విధానపరమైన నిర్ణయాలను కేంద్రం తీసుకోవాల్సిందన్నారు. కానీ, రైతుల ఒత్తిడికి కేంద్రం తలొగ్గిందన్నారు. యూపీ, పంజాబ్​లో గెలవాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని, ఇది దురదృష్టకరమని.. దీనివల్ల ఎలాంటి మంచి జరగదన్నారు. రైతులకు చట్టాల ద్వారా స్వేచ్ఛ కల్పించారని… స్వాతంత్ర్యానికి ముందు ఆ తర్వాత జరిగినట్లుగా రైతులు ఇకపైనా దౌర్జన్యానికి గురవుతారన్నారు.

పార్లమెంట్​లో ఆమోదించే సమయంలో సరిగా చర్చ జరిపి ఉంటే, లేదా పార్లమెంటరీ ప్యానెల్​కు సిఫార్సు చేసి ఉంటే చట్టాలు కొనసాగేవని అనిల్ ఘన్వాట్ అభిప్రాయపడ్డారు. మూడు చట్టాల్లో రెండు ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అమలవుతున్నాయని ఘన్వాట్ గుర్తు చేశారు. కొత్త చట్టాల్లో కొన్ని నిబంధనల అమలును నిలిపివేసినా.. పలు రాష్ట్రాలు అదే తరహా నిబంధనలను ప్రవేశపెట్టాయని చెప్పారు.

ఇక, ప్యానెల్ అందించిన నివేదికను సుప్రీంకోర్టు విడుదల చేయకపోతే తామే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఘన్వాట్ తెలిపారు. ప్యానెల్ రిపోర్టు రైతులకు ప్రయోజకరంగానే ఉందని చెప్పారు. నివేదిక విడుదలపై వచ్చే వారం నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా,ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్.. మార్చి 19న సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది. అయితే, దీన్ని సుప్రీంకోర్టు బహిరంగపర్చలేదు. నివేదిక అంశాలను బయటకు వెల్లడించాలని సెప్టెంబర్ 1న ఘన్వాట్.. సీజేఐకి లేఖ రాశారు. కమిటీ సిఫార్సులు బయటకు వస్తే.. రైతుల ఆందోళనలు సద్దుమణిగే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు.

ALSO READ Kangana..farm laws : వ్యవసాయ చట్టాల రద్దుపై కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు