PM Modi
Parliament Winter Session 2024: ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ వెలుపల మీడియా పాయింట్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సమావేశాలు సజావుగా జరిగేలా ప్రతీఒక్కరూ సహకరించాలని అధికార, విపక్ష సభ్యులును మోదీ కోరారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నవంబర్ 26వ తేదీ (మంగళవారం) నాటికి 75వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. దానికి గుర్తుగా రేపు సంవిధాన్ సదన్ లో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకుందామని మోదీ అన్నారు. అయితే, మోదీ మీడియాతో మాట్లాడుతూ విపక్షాలపై ఫైర్ అయ్యారు.
Also Read: Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధం.. విచారణకు గైర్హాజరుపై పోలీసులు సీరియస్
దురదృష్టవశాత్తూ కొందరు తమ రాజకీయ ప్రయోజనాలకోసం పార్లమెంట్ సమావేశాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు ఆమోదయోగ్యంగాలేని కొద్దిమంది వ్యక్తులు గూండాయిజం ద్వారా పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళం సృష్టించాలని నిరంతరం ప్రయత్నిస్తున్నారు. అయితే, సమయం వచ్చినప్పుడు దేశ ప్రజలు వారిని శిక్షిస్తారు. ఢిల్లీలోని కొందరు కావాలని చేస్తున్న పనివల్ల కొత్త ఎంపీలు ఏ పార్టీలోఉన్నా వారికి మాట్లాడే అవకాశం రావడం లేదు. వారు కొత్త ఆలోచనలతో సమావేశంకు వస్తుంటారు. కానీ, వారు మాట్లాడేందుకు అవకాశం రాకుండా పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవాలని చూస్తున్నారని మోదీ విపక్షాలను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరి వల్ల సమావేశాల్లో గందరగోళం నెలకొనడంతో కొత్త ఎంపీలు మాట్లాడే అవకాశం కోల్పోతున్నారని మోదీ అన్నారు. సమావేశాల్లో గందరగోళం సృష్టించేవారికి ప్రజలపై ఎలాంటి బాధ్యత ఉండదు. అందుకే వారు ప్రజల అంచనాలను ఎన్నటికీ అందుకోలేరు అంటూ మోదీ అన్నారు.