Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధం.. విచారణకు గైర్హాజరుపై పోలీసులు సీరియస్
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ లోని ఆయన నివాసానికి ఏపీ పోలీసులు వెళ్లారు.

Ram Gopal Varma
Ram Gopal Varma: సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు రాంగోపాల్ వర్మ ఇవాళ హాజరుకావాల్సి ఉంది. కానీ, ఆయన విచారణకు హాజరుకాకపోవటంతో పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకొనేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన్ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఒంగోలు పోలీసులు హైదరాబాద్ లోని వర్మ నివాసానికి వెళ్లారు. మరికొద్ది సేపట్లో అరెస్టు చేసి.. మద్దిపాడు పీఎస్ కు ఆర్జీవీని తరలించే అవకాశం ఉంది.
Also Read: చంద్రబాబును తిట్టిన వాళ్లను వదిలేది లేదు- కొడాలి నాని, వంశీల బుద్దా వెంకన్న ఫైర్
వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై వారి వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ పోస్టులు పెట్టారు. అయితే, ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య రాంగోపాల్ వర్మ చంద్రబాబు, పవన్ లపై పెట్టిన పోస్టులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణకు హాజరు కావాలని ఆర్జీవీని నోటీసులు ఇచ్చారు. అయితే, రాంగోపాల్ వర్మ విచారణకు హాజరు కాకుండా తనకు పోలీసుల అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టులో అతనికి చుక్కెదురైంది. అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని కోర్టు చెప్పింది.
Also Read: Cyclone Fengal : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!
విచారణకు నాలుగు రోజులు సమయం కావాలంటూ ఈనెల 19న ఒంగోలు పోలీసులకు రాంగోపాల్ వర్మ సమాచారం ఇచ్చారు. గడువు ముగిసినా విచారణకు హాజరుకాకపోవటంతో పోలీసులు మరోసారి రాంగోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన ఇవాళ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకావాల్సి ఉంది. విచారణకు రాకపోవటంతో ఒంగోలు పోలీసులు హైదరాబాద్ లోని రాంగోపాల్ వర్మ నివాసానికి వెళ్లారు. ఏ క్షణమైనా ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.