PM Narendra Modi
Independence Day 2023: : 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం 10వ సారి జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు విషయాలను ప్రముఖంగా ప్రధాని ప్రస్తావించారు. దాదాపు గంటన్నర పాటు నరేంద్ర మోదీ ప్రసంగం సాగింది. ఈ సందర్భంగా దేశ ప్రజలకు పలు శుభవార్తలను మోదీ అందించారు. మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారానికి కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నామని, బ్యాంకు రుణాలపై రాయితీ ఇచ్చే కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నామని ప్రధాని మోదీ చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో నివసించే దిగువ, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కల సాకారమే లక్ష్యంగా పథకం ఉండబోతుందని అన్నారు. లక్షల రూపాయల ప్రయోజనం కల్పించే ఈ పథకం త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ధరల పెరుగుదలతో ప్రజలు పడుతున్న కష్టాన్ని తగ్గించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని మోదీ అన్నారు.
హైడ్రో ఆధారిత రవాణా వ్యవస్థ నుంచి క్వాంటమ్ కంప్యూటర్లు, మెట్రో రైళ్ల వ్యవస్థల్లో వేగంగా ముందడుగు వేస్తున్నామని చెప్పారు. పాత ఆలోచనలు, విధానాలు పక్కనపెట్టి నూతన లక్ష్యాల దిశగా భారత్ వేగంగా సాగుతోందని అన్నారు. సర్వజనహితంతో సుదూర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త దారులు నిర్మిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా అమృత్ సరోవర్‌లో భాగంగా 75వేల జలవనరులను అభివృద్ధి చేస్తున్నామని, జలశక్తి, జనశక్తి ఏకమై పర్యావరణ పరిరక్షణకు ముందడుగు వేస్తున్నామని అన్నారు. నూతన ఇంధన వనరులను దేశ ముందుకు తీసుకొస్తున్నామని, సౌరశక్తి, పవనశక్తిని సద్వినియోగం చేస్తూ చౌకధరలో విద్యుదుత్పత్తి చేస్తున్నామని ప్రధాని అన్నారు. ఇథనాల్ ఉత్పత్తిలో ముందడుగు వేసి పెట్రో దిగుమతుల భారం మరింత తగ్గిస్తున్నామని చెప్పారు.
ఏ శక్తికి భారత్ భయపడదు.. తలవంచదు. సమూన్నత లక్ష్యాలతో భారత్ స్వయం సమృద్ధి సాధిస్తూ ప్రపంచంతో అనుసంధానమవుతోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. భారత్ స్వయం సమృద్ధి సాధించడంతోపాటు ప్రపంచాభివృద్ధికి తన వంతు భూమిక పోషిస్తోందని ప్రధాని అన్నారు. భారత్ విశ్వమిత్ర రూపంలో ప్రతి దేశానికి మిత్రదేశంగా ఉండాలనుకుంటోందని, ప్రపంచంలోని ప్రతిదేశం భారత్ మిత్రుడేనని మోదీ చెప్పారు. భారత్ లోకకల్యాణం కోసం పనిచేస్తోందని, ఒకే సూర్యుడు, ఒకే భూమి, ఒకే ప్రపంచమన్నది భారత విధానమని ప్రధాని తెలిపారు. ఒకే భూమి సర్వమానవాళి సంక్షేమ లక్ష్యంగానే భారత్ విధానాలు ఉంటాయని అన్నారు. 2047 నాటికి భారత్ వికసిత భారత్ అయి తీరుతుందని, నా దేశ ప్రజలపై ఉన్న నమ్మకంతో ఈ మాట చెబుతున్నానని ప్రధాని పేర్కొన్నారు. 100 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవం నాటికి తిరంగా వికసిత తిరంగా గా మారాని మోదీ ఆకాంక్షించారు.