PM Narendra Modi : ప్రధాని పదవికి మోదీ రాజీనామా.. ఆమోదించిన రాష్ట్రపతి.. అప్పటివరకూ ఆపద్ధర్మ ప్రధానిగానే!

PM Narendra Modi : కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రధాని పదవిలో కొనసాగాలని ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలిని అభ్యర్థించినట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.

PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఆయన అందజేశారు. మోదీ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి వెంటనే ఆమోదించారు. మోదీతో పాటు మంత్రిమండలి రాజీనామాలను కూడా రాష్ట్రపతి ఆమోదించారు.

మోదీ రాజీనామాతో ఆయన మంత్రివర్గం మొత్తం రద్దు అయింది. కేంద్ర మంత్రులు అందరూ ఇప్పుడు మాజీలు అయ్యారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రధాని పదవిలో కొనసాగాలని ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలిని అభ్యర్థించినట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అప్పటివరకూ మోదీ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగనున్నారు.

ఈ నెల 8న 3వసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం? :
లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)కి స్పష్టమైన మెజారిటీ లభించడంతో జూన్ 8వ తేదీ శనివారం రోజున మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అదే రోజు కేంద్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకారోత్సవం కూడా జరిగే అవకాశం ఉంది.

ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు బుధవారం (జూన్ 5) ఉదయం ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. 17వ లోక్‌సభ రద్దుకు సిఫారసు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈరోజు ఉదయం 11.30 గంటలకు సమావేశం ప్రారంభమైన తర్వాత మంత్రి మండలి సమావేశం జరిగిందని తెలిపాయి. మోదీ 2.0 క్యాబినెట్, మంత్రి మండలికి ఇదే చివరి సమావేశం.

ప్రస్తుత లోక్‌సభ రద్దుపై కేబినెట్ సిఫార్సు 18వ లోక్‌సభకు మార్గం సుగమమైంది. ప్రస్తుత 17వ లోక్‌సభ గడువు జూన్ 16తో ముగియనుంది. కేబినెట్ సమావేశం లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కూడా సమీక్షించింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన విషయాలను కూడా చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

240 సీట్లతో మెజారిటీతో ఆగిపోవడంతో మిత్రపక్షాల సహకారంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. 543 మంది సభ్యులున్న సభలో ఎన్డీయేకు 293 సీట్లు వచ్చాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ 99 స్థానాలను కైవసం చేసుకోగా, ఇండియా కూటమి 233 స్థానాలను గెలుచుకుంది.

Read Also : ఎన్డీయేలో కింగ్ మేకర్‌గా చంద్రబాబు..! కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖల కోసం పట్టు..!

ట్రెండింగ్ వార్తలు