కార్‌లో ఒంటరిగా డ్రైవింగ్ చేస్తే.. మాస్క్ లేకున్నా ఫైన్ కట్టక్కర్లేదు!

కరోనా మహమ్మారి సమయంలో ప్రతిఒక్కరూ బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా ముఖానికి మాస్క్ ధరించాలి.. సామాజిక దూరాన్ని పాటించాలి.. ముఖానికి మాస్క్ లేకుండా బయటకు తిరిగేందుకు అనుమతించడం లేదు పోలీసులు… ప్రత్యేకించి వాహనాల్లో ప్రయాణించే వారిని తప్పనిసరిగా మాస్క్ ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు. లేదంటే జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు..
కోవిడ్ యాక్ట్ ప్రకారం.. వాహనంలో ప్రయాణించేవారు ఎవరైనా ఫేస్ మాస్క్, సామాజిక దూరం పాటించకపోతే వారికి జరిమానా విధిస్తున్నారు పోలీసులు.. బహిరంగ ప్రదేశాల్లో లేదా ఇతరేతర ప్రదేశాల్లో ఎక్కడైనా గుంపులుగా ఉండరాదని, అలా ఉంటే తప్పనిసరిగా మాస్క్ ధరించడంతో పాటు సామాజిక దూరాన్ని పాటించాలని సూచిస్తున్నారు. అయితే ఇప్పుడు కారు డ్రైవింగ్ చేసే సమయంలో లేదా వ్యాయామం చేసేటప్పుడు లేదా సైక్లింగ్ చేసే సమయంలో బైక్ నడిపే సమయంలో ఒకే వ్యక్తి మాత్రమే ఉంటే… మాస్క్ ధరించకపోయినా పర్వాలేదు.. పోలీసులు ఎలాంటి జరిమానా విధించరు..
వాహనంలో ఎవరైనా కారు డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా సైక్లింగ్ ఒక్కరే చేస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో వెల్లడించలేదు.. అందుకే ఒంటరిగా వాహనం నడిపేవారు మాస్క్ ధరించకపోయినా వారికి పోలీసులు జరిమానా విధించడం లేదు..
మాస్క్ మాత్రమే ఉండాలి :
కారులో ప్రయాణించే సమయంలో డ్రైవింగ్ చేసే వ్యక్తితో పాటు ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే.. తప్పకుండా మాస్క్ ధరించాల్సి ఉంటుంది.. అదే వ్యాయామం చేసే సమయంలో కూడా గుంపుగా ఉన్నప్పుడు కూడా మాస్క్ తప్పక ఉండాలి. సామాజిక దూరం కూడా తప్పనిసరిగా పాటించాలి. మాస్క్ ధరించడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకకుండా జాగ్రత్త పడొచ్చునని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు.
పోలీసుల చలాన్లపై ఫిర్యాదులు :
వాహనం నడిపే సమయంలో మాస్క్ ధరించలేదనే కారణంతో పోలీసులు వాహనదారులకు చలాన్లు విధిస్తున్నారు.. దీనిపై పెద్ద సంఖ్యలో వాహనదారులు పోలీసుల చలాన్లపై ఫిర్యాదు చేస్తున్నారు. ఒంటరిగా కారు డ్రైవింగ్ లేదా సైకిల్ తొక్కే వ్యక్తి తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిన అవసరం ఉందా? అనే ప్రశ్నకు భూషణ్ క్లారిటీ ఇచ్చారు..
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ఈ విషయంలో ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఒంటరిగా డ్రైవింగ్ చేసే వాహనదారులు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని ఆయన చెప్పకనే చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిరోజు సగటున 1,200 నుంచి 1,500 మందికి ఢిల్లీ పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. ఫేస్ మాస్క్ లేకుండా వాహనాన్ని డ్రైవింగ్ చేస్తున్నారని వారికి చలాన్లు విధిస్తున్నారు.
పోలీసుల తప్పు కాదు :
ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (DDMA) జూన్ 13న జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే ఢిల్లీ పోలీసులు ఫేస్ మాస్క్ ధరించని వాహనదారులకు చలాన్లు విధిస్తున్నారు.. ఇదే విషయాన్ని ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. పబ్లిక్ ప్రాంతాల్లో ఎవరైనా మాస్క్ లేకుండా కనిపిస్తే వారి నుంచి రూ. 500 వరకు జరిమానా విధించాలని మార్గదర్శకాల్లో ఉంది.. ఈ మార్గదర్శకాలనే ఢిల్లీ పోలీసులు అనుసరిస్తున్నారని ఆయన చెప్పారు.
రోడ్లపై తిరిగే వ్యక్తులే కాదు.. బహిరంగ ప్రదేశాల్లో కార్లలో వెళ్లే వారు ఫేస్ మాస్క్ ధరించకపోతే పోలీసులు జరిమానా విధిస్తున్నారు. ఈ చలాన్లను సబ్ ఇన్స్ పెక్టర్ లేదా ఆపై ర్యాంకు పోలీసు అధికారులెవరైనా ఈ చలాన్లు విధించే అధికారం ఉంది. జరిమానాలకు సంబంధించి రాతపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు తమకు అందలేదని తెలిపారు. అలాంటి ఏదైనా కొత్త మార్గదర్శకాలు తమకు అందిన వెంటనే ఆ ప్రకారమే ఢిల్లీ పోలీసులు ఫాలో అవుతారని పోలీసు అధికారి వెల్లడించారు.