Wrong Side Driving (Image Credit To Original Source)
Wrong Side Driving: ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారికి అలర్ట్. రాంగ్‌సైడ్ డ్రైవింగ్ చేస్తే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం నిబంధనలను తీసుకురావాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ నిబంధనలు అమలు చేస్తారని తెలుస్తోంది.
ఇప్పటికే, ట్రాఫిక్ ఉల్లంఘనలపై మరింత కఠినతర చర్యలు తీసుకోవడంలో భాగంగా ఢిల్లీ పోలీసులు రాంగ్‌సైడ్ డ్రైవింగ్ చేసిన ఘటనలపై 2 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేవలం చలాన్లు జారీ చేసే విధానానికి బదులుగా క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా పోలీసులు వెళ్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఏపీలో ఇప్పట్లో మున్సిపల్ ఎన్నికలు లేనట్లేనా? అడ్డంకులు ఏంటి?
ఇందులో భాగంగా ఢిల్లీలో నమోదు చేసిన 2 ఎఫ్ఐఆర్‌ల అంశాన్ని కీలక మార్పుగా పోలీసులు భావిస్తున్నారు. సంబంధిత ట్రాఫిక్ సర్కిళ్ల పరిధిలో పనిచేసే ట్రాఫిక్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు ఈ ఎఫ్ఐఆర్‌లను నమోదు చేశారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన తొలి కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీనే. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రెండు కేసులు బీఎన్ఎస్ సెక్షన్ 281, మోటారు వాహనాల చట్టం సంబంధిత సెక్షన్ల కింద నమోదయ్యాయి.
ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకోవాలనే తొందరలో..
కపాసేరాలోని చౌక్ సమీపంలో ఒక డ్రైవర్ రోడ్డు కుడివైపు నుంచి వాహనాన్ని నడిపినట్లు గుర్తించడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ట్రాఫిక్ జామ్ తప్పించుకోవాలనే తొందర వల్ల అలా చేశానని ట్రాఫిక్ పోలీసుకు ఆ డ్రైవర్ తెలిపినట్లు తెలుస్తోంది.
సాధారణంగా రోడ్డుపై రాంగ్‌సైడ్ డ్రైవింగ్ చేస్తే రూ.5,000 జరిమానా విధిస్తారు. అయితే, భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 281 కింద ఎఫ్ఐఆర్ నమోదైతే గరిష్ఠంగా 6 నెలల జైలు శిక్ష/1,000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంటుంది. వాహనాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఢిల్లీలో తొలి 2 ఎఫ్ఐఆర్‌లలో పేర్కొన్న నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు.
ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించే విధంగా డ్రైవింగ్ చేసినప్పుడు లేదా భారీ ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో ఉల్లంఘనలు జరిగితే ట్రాఫిక్ అధికారి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు.