ఏపీలో ఇప్పట్లో మున్సిపల్ ఎన్నికలు లేనట్లేనా? అడ్డంకులు ఏంటి?
జనగణన లెక్కలు వచ్చాక.. 2027లోనే ఓ అంచనాకు వస్తారని అంటున్నారు.
Vote (Image Credit To Original Source)
- ప్రస్తుత సర్పంచుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగింపు
- మార్చిలో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం కూడా..
- అంతలోపే జనగణన స్టార్ట్
Municipal Elections: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ముగిశాయి. మున్సిపల్ ఎన్నికలకు అంతా రెడీ అవుతోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కసరత్తు జరుగుతోంది. ఇదే టైమ్‌లో ఏపీలో కూడా లోకల్ బాడీ, మున్సిపల్ ఎలక్షన్స్‌కు వేగంగా అడుగులు పడ్డాయి. ఈ జనవరిలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు స్టేట్ ఈజీ సిద్ధమైంది.
వార్డుల విభజన, ఓటర్ల జాబితా తయారీ స్పీడప్ చేసింది. కూటమి పార్టీలు కూడా ఎన్నికల వ్యూహాల్లో బిజీగా అయిపోయాయి. కట్ చేస్తే ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలు, మున్సిపల్ పోల్స్ ఇప్పట్లో జరిగే పరిస్థితి లేదన్న టాక్ బయలుదేరింది. ఏపీలో ప్రస్తుత సర్పంచుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగుస్తుంది.
మార్చిలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం ముగియనుంది. కానీ అంతలోపే జనగణన స్టార్ట్ అవుతుంది. దీంతో పంచాయితీల విలీనం, విభజన..సేమ్‌టైమ్ మున్సిపాలిటీల విలీనం, విభజనకు అవకాశం లేకుండా పోతోంది. దీంతో ఏపీలో మున్సిపల్ ఎన్నికలు ఆలస్యం అవుతాయని అంటున్నారు.
Also Read: కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టేది ఆ రోజే? ఇటీవలి కాలంలో ఇలా ఎన్నడూ జరగలేదు..
లేటెస్ట్ డెవలప్‌మెంట్ ప్రకారం జనగణన తర్వాతే ఏపీలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందట. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా మున్సిపల్ ఎన్నికలపై స్పష్టత ఇచ్చేశారు. ఈ ఏడాది కేంద్రం జనగణన నిర్వహిస్తోంది. ఈ ప్రాసెస్ అంతా పూర్తి కావడానికి కనీసం ఆరు ఏడు నెలలు పడుతుందట.
క్లారిటీ రావాలంటే ఏడాది సమయం పక్కా
జనగణన మొత్తం పూర్తి అయి.. ఓ క్లారిటీ రావాలంటే ఏడాది సమయం పక్కా పడుతుందని..2026 డిసెంబర్ వరకు జనగణన మొత్తం పూర్తవుతుందని భావిస్తున్నారట. దాంతో జనగణన కంప్లీట్ అయ్యాకే ఆ వివరాలు అన్నీ చూసుకుని కొత్త డేటా ప్రకారం ఎన్నికలు పెట్టాలనేది కూటమి ప్రభుత్వం ఆలోచనగా చెబుతున్నారు. 2027 స్టార్టింగ్‌లో లోకల్ బాడీస్, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉందట ఏపీ సర్కార్.
ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర 2011 జనాభా లెక్కల వివరాలే ఉన్నాయి. ఆ తర్వాత అయితే 2021లో కరోనా కారణంగా జనగణన జరగలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జనగణనను చేయాలని డిసైడ్ అయింది. దీంతో ఏపీలో ఎన్నికలు వాయిదా పడతాయని అంటున్నారు. కొత్త లెక్కలతో సామాజిక సమీకరణలు కూడా చూసుకుని పూర్తి సమాచారంతో అన్ని వర్గాలకు న్యాయం చేసేలా రిజర్వేషన్ కూర్పు చేస్తారని చర్చ జరుగుతోంది.
విజయవాడ, తిరుపతి కార్పొరేషన్‌లను గ్రేటర్‌గా..
ఇక మార్చితో మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పాలక వర్గం గడువు ముగుస్తుంది. దాంతో పాలక మండళ్లు రద్దు అవుతాయి. అయితే తొమ్మిది నెలల నుంచి ఏడాది దాకా ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలోనే లోకల్ బాడీస్ పాలన సాగుతుందని అంటున్నారు. ఇక విజయవాడని గ్రేటర్‌గా మార్చాలనే ప్రతిపాదన ఉందట. తిరుపతి కార్పొరేషన్‌ను కూడా గ్రేటర్‌గా చేసే ఆలోచన ఉందంటున్నారు.
ఈ డిమాండ్లపై కూడా జనగణన లెక్కలు వచ్చాక.. 2027లోనే ఓ అంచనాకు వస్తారని అంటున్నారు. ఫైనల్‌గా ఈ ఏడాదిలో మున్సిపల్ ఎన్నికలు అయితే ఉండవంటున్నారు. దాంతో ఇటు కూటమి పార్టీలకు..ఇటు వైసీపీకి స్థానిక వ్యూహాలు రచించేందుకు ఇంకో ఏడాది టైమ్ దొరికినట్లు అయింది.
