అయోధ్య తీర్పుపై ఎవరేమన్నారంటే

  • Publish Date - November 10, 2019 / 12:47 AM IST

అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును బీజేపీ, కాంగ్రెస్‌ సహా ప్రధాన పార్టీలన్నీ స్వాగతించాయి. ఈ తీర్పును సుప్రీం చరిత్రలో మైలురాయిగా అభివర్ణించాయి. ఇదే సామరస్యాన్ని కొనసాగించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చాయి. కేంద్ర, ప్రభుత్వం పోలీసుల హెచ్చరికలతో చాలామంది నేతలు మౌనం దాల్చగా… నెటిజన్లు సంయమనం పాటించారు. అయోధ్యపై వెలువడ్డ తీర్పు దేశానికి ఎంతో కీలకమైన సందేశం ఇచ్చిందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. దేశప్రజలందరూ కలిసి ముందుకు వెళ్లాలని… కలిసి జీవించాలని గుర్తుంచుకునేలా నవంబర్ 9వ తేదీ సూచించిందన్నారు. ఎవరి మనసులో ఎక్కడైనా చెడు భావన మిగిలి ఉంటే దాన్ని తొలగించుకోవాలన్నారు మోదీ.

> అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమన్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్. ఈ తీర్పు తర్వాత సమాజంలో సమానత్వం మరింత బలోపేతమవుతుందన్నారు.
> సుప్రీం తీర్పును స్వాగతిస్తునట్లు బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ తెలిపారు. భారత స్వాతంత్ర్య ఉద్యమం తరువాత రామజన్మభూమి కోసం చేసిన ఆందోళనే అతి పెద్దదని ఆయన చెప్పారు. సుప్రీం తీర్పుపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన.. త్వరలో రామాలయ నిర్మాణం  చేపట్టాలన్నారు.
> అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పుతో రామ మందిరం నిర్మాణం జరుగుతుందని… ఇక ఎన్నికలన్నీ అసలైన సమస్యలపైనే జరుగుతాయని అన్నారు. ఇకపై జరిగే ఎన్నికల్లో రామ మందిరం అంశం ఉండబోదని, రోటి, దుస్తులు, విద్య లాంటి అసలైన అంశాలపైనే ఎన్నికలు జరుగుతాయని ఉమాభారతి స్పష్టం చేశారు. 
> సుప్రీంకోర్ట్‌ తీర్పును కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ స్వాగతించారు. అయోధ్యపై ధర్మాసనం తీర్పును గౌరవిస్తున్నట్లు తెలిపారు. మందిరం నిర్మాణానికి తాము అనుకూలమని స్పష్టం చేశారు. ఇదే రీతిలో సామరస్యాన్ని కొనసాగించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
> సుప్రీంకోర్టు తుది తీర్పుపై శివసేన అధినే ఉద్ధవ్ థాక్రే హర్షం వ్యక్తం చేశారు. అంతేగాక, తాను నవంబర్ 24న అయోధ్యలో పర్యటించి శ్రీరాముడ్ని దర్శించుకుంటానని అన్నారు. అద్వానీని కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతానని ఉద్ధవ్ థాక్రే చెప్పారు. అయోధ్య రామ మందిరం కోసం ఆయన రథయాత్ర చేశారని గుర్తు చేశారు. అద్వానీని తప్పకుండా కలుస్తానని, ఆయన ఆశీస్సులు తీసుకుంటానని ఉద్ధవ్ థాక్రే చెప్పుకొచ్చారు.
> సుప్రీంకోర్ట్‌ తీర్పుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు ఇచ్చిన తీర్పుతో తాము సంతృప్తి చెందలేదన్నారు. సుప్రీంకోర్టు నిజంగా సుప్రీం… కానీ తప్పు చెయ్యదు అని కాదన్నారు. రాజ్యాంగంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని… తమ హక్కుల కోసం కచ్చితంగా పోరాడతామని అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు.
Read More : అయోధ్య తీర్పుపై స్పందించిన అద్వాణీ