Lok Sabha elections 2024: అప్పట్లో చంద్రబాబు ఇలాగే చేశారు.. చివరికి ఏమైంది? సీఎం నితీశ్‌కు ప్రశాంత్ కిశోర్ చురకలు
Lok Sabha elections 2024: ప్రశాంత్ కిశోర్ ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 2019 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు కూడా ఇటువంటి ప్రయత్నాలే చేశారని గుర్తు చేశారు.

Prashant Kishor
Lok Sabha elections 2024: భారత్ లో వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయాలని ప్రయత్నాలు జరుపుతున్న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా, 2019 లోక్‌సభ ఎన్నికల ముందు అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలను కూడా ప్రశాంత్ కిశోర్ ప్రస్తావించడం గమనార్హం. 2019లో ఏపీలోనూ ఎన్నికలు జరగగా టీడీపీ ఓడిపోయిన విషయాన్ని గుర్తుచేశారు.
ప్రశాంత్ కిశోర్ ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… 2019 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు కూడా ఇటువంటి ప్రయత్నాలే చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా మళ్లీ అవే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. నితీశ్ కుమార్ ది అసమర్థ ప్రభుత్వమని అన్నారు. ఇటువంటి వ్యక్తులు ఎవరినైనా ప్రధానిని చేయగలరా అని ప్రశ్నించారు. నితీశ్ పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడిలాగే అవుతుందని విమర్శించారు.
ఆయన మొదట బిహార్ గురించి ఆలోచించాలని ప్రశాంత్ కిశోర్ ఎద్దేవా చేశారు. బిహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ చైర్‌పర్సన్ తేజస్వీ యాదవ్ పై కూడా ప్రశాంత్ కిశోర్ విమర్శలు గుప్పించారు. కనీసం ఒక్క ఎంపీ కూడా లేని పార్టీ దేశానికి ప్రధానిని నిర్ణయించాలనుకుంటోందని చురకలు అంటించారు.
ఒకవేళ లాలూ ప్రసాద్ యాదవ్ కు కొడుకుగా పుట్టకపోతే తేజస్వీ యాదవ్ కు దేశంలో ఏ ఉద్యోగమూ దొరకకపోయేదని అన్నారు. కాగా, ఇటీవలే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్ కలిశారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేయాలని నితీశ్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. కొన్ని వారాల క్రితం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్ కలిశారు.