Prashant kishor
Bihar Assembly Election: బిహార్‌లో జూన్ 21 నుంచి పోలింగ్ రోజు వరకు ఎన్డీఏ ప్రభుత్వం సుమారు రూ.40,000 కోట్ల ఖర్చు చేసిందని ప్రశాంత్ కిశోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. అందులో రూ.14,000 కోట్ల వరల్డ్ బ్యాంక్ నిధులు కూడా ఉన్నాయని చెప్పింది.
వరల్డ్ బ్యాంక్ ఆ డబ్బును అభివృద్ధి పనులకు కేటాయించిందని, ఆ మొత్తాన్ని బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు మహిళలకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున నగదు ఇచ్చేందుకు మళ్లించారని చెప్పింది. దీంతో ఎన్నికలు ప్రభావితం అయ్యాయని పేర్కొంది.
ఈ చర్యను ఆ పార్టీ “ప్రజా ధన దుర్వినియోగం, ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే అనైతిక ప్రయత్నం”గా పేర్కొని, దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది.
నితీశ్ కుమార్ ప్రభుత్వం పోలింగ్ ముందు ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజనలో భాగంగా 1.25 కోట్ల మంది మహిళల ఖాతాల్లో డబ్బులు వేసిందని చెప్పింది.
జన్ సురాజ్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ సింగ్ మాట్లాడుతూ.. “ఈ ఎన్నికల ఫలితాలు డబ్బుతో ముడిపడి వచ్చాయి. జూన్ 21 నుంచి పోలింగ్ రోజు వరకు సుమారు రూ.40,000 కోట్ల వ్యయం జరిగింది. ప్రజల ఓట్లను కొనుగోలు చేసినట్టే. వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన నిధులు కూడా ఈ నగదు పంపిణీకి ఉపయోగించినట్టు తెలిసింది” అని చెప్పారు.
బిహార్ ఆర్థిక పరిస్థితి ఇంత పెద్ద మొత్తాన్ని భరించే స్థితిలో లేదని, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సేవలకు వినియోగించేందుకు డబ్బు దాదాపు మిగలలేదని అన్నారు.
జన్ సురాజ్ ప్రతినిధి పవన్ వర్మ కూడా ఇటువంటి ఆరోపణలే చేశారు. బిహార్ ఖజానా ఖాళీ అయిపోయినట్టు పేర్కొన్నారు. “మహిళలకు రూ.10,000 చొప్పున ఇచ్చిన డబ్బు మొత్తం వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చిన రూ.21,000 కోట్లలోంచే ఇచ్చారన్న సమాచారం మా వద్ద ఉంది. పోలింగ్ నియమావళి అమల్లోకి రాక ముందు ఒక గంటలో రూ.14,000 కోట్లను తీసి 1.25 కోట్ల మహిళలకు పంపిణీ చేశారు” అని పేర్కొన్నారు.
Also Read: Hindupuram: హిందూపురంలో ఉద్రిక్తత.. ఇద్దరు వైసీపీ నేతల అరెస్ట్
“ఇది నిజమైతే నైతికత ఇక ఎక్కడ నిలుస్తుంది. చట్టపరంగా పెద్దగా ఏమీ చేయలేం. ప్రభుత్వం నిధులు మళ్లించి తర్వాత వివరణ ఇస్తుంది. ఇక పశ్చిమ బెంగాల్, తమిళనాడుతో పాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికలు వస్తున్నాయి. ఒకరు హామీలు ఇస్తారు, మరొకరు డబ్బు ఇస్తారు, ఇది ఓటర్లను ప్రభావితం చేస్తుంది” అని అన్నారు.
బిహార్‌లో ప్రజలపై పడుతున్న అప్పుల భవారం ప్రస్తుతం రూ.4.06 లక్షల కోట్ల స్థాయిలో ఉందని, రోజువారీ వడ్డీ భారం రూ.63 కోట్లు అని చెప్పారు. ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పారు. కాగా, ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికలో 238 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటూ గెలుచుకోలేదు. ఎన్డీఏ 202 స్థానాలతో విజయం సాధించింది. బీజేపీ 89 సీట్లు, జేడీయూ 85 సీట్లు సాధించాయి. చిరాగ్ పస్వాన్ నేతృత్వంలోని లోక్ జన్‌శక్తి పార్టీ (ఆర్వీ) కూడా మంచి ఫలితాలు సాధించి ఎన్డీఏను బలపరిచింది.
ఆర్జెడీ నేతృత్వంలోని మహాగఠ్‌బంధన్ భారీ పరాజయాన్ని చవిచూసింది. ఆర్జేడీ 25 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ 6 సీట్లకే పరిమితమైంది.