Navjot Singh Sidhu
Navjot Singh Sidhu : నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఒకప్పుడు క్రికెటర్. ఇప్పుడు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఈయన పేరు ప్రధానంగా వినిపిస్తోంది. పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం చేశాడని విమర్శలు గుప్పుమంటున్నాయి. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ కన్న కలలు నెరవేరలేదు. ఘోరమైన పరాజయం దిశగా ముందుకెళుతోంది. ఈ రాష్ట్రంలో ఆప్ పార్టీకి పట్టం కట్టారు. స్పష్టమైన మెజార్టీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రెడీ అవుతోంది ఆప్ పార్టీ. ఆప్ సృష్టించిన దూకుడుకు కాంగ్రెస్ తో సహా ఇతర పార్టీలు కొట్టుకపోయాయి.
Read More : AAP in Punjab: పంజాబ్ ను కైవసం చేసుకున్న “ఆమ్ ఆద్మీ”: సక్సెస్ సీక్రెట్
కాంగ్రెస్ కు చుక్కలు చూపించిన ఆప్ :-
సరైన గేమ్ ప్లాన్ లేకుండా బరిలోకి దిగిన కాంగ్రెస్‌కు చుక్కలు చూపించింది ఆమ్ ఆద్మీ పార్టీ. కీలక ఆటగాళ్లతో వివాదాలు పెట్టుకొని లీగ్ ప్రారంభానికి ముందే వారందరిని టీమ్ నుంచి సాగనంపిన కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకుంది. ముఖ్యంగా ఏ ఆటగాడిని నమ్మకూడదో అతడ్నే కోచ్‌గా చేసి నట్టేట మునిగిపోయింది. క్రికెట్‌లో మంచి ఆటగాడే కావచ్చు కానీ.. రాజకీయాల్లో మాత్రం నవజ్యోత్ సింగ్ సిద్ధు మ్యాచ్ ఫిక్సింగ్‌కు తక్కువ.. వెనుపోటుకు ఎక్కువ అన్నట్లు ఆడుతుంటారనే విమర్శలున్నాయి! సొంత టీమ్‌లో స్పూర్తి నింపాల్సిన సిద్ధు చాలా సార్లు ప్రత్యర్థి టీమ్‌లకు ఉచిత కోచింగ్ ఇచ్చారని, ఇప్పుడు ఆ సిద్ధునే పటిష్టమైన కాంగ్రెస్ టీమ్‌ను క్లబ్ స్థాయి టీమ్‌గా దిగజార్చాడని పేర్కొంటుంటారు. నమ్మిన పార్టీ పెద్దల పరువును కౌంటింగ్ గ్రౌండ్‌లోనే ఊడ్చిపడేశాడని ఎన్నికల ఫలితాలు చూసిన వారు వెల్లడిస్తున్నారు.
Read More : Punjab CM Charanjit Singh: రాజీనామాకు సిద్ధమైన పంజాబ్ సీఎం
కాంగ్రెస్ చెత్త ప్రదర్శన :-
ఒకరిద్దరిని కాదు.. టీమ్‌లో సగం కంటే ఎక్కువ బ్యాటర్లను రన్ అవుట్ చేశాడు సిద్ధు. సెల్ఫిష్ బ్యాటింగ్‌తో టీమ్ మొత్తాన్ని అవుట్ చేశాడు. ఇతర ఆటగాళ్లతో సమన్వయంతో ఆడాల్సిన సిద్ధు.. తన బ్యాటింగ్‌పై మాత్రమే ఫోకస్ చేశాడు. అందుకే కాంగ్రెస్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు..! లీగ్ ప్రారంభానికి ముందు కెప్టెన్సీ కోసం పాకులాడిన సిద్ధు.. తీరా అది దక్కకపోయే సరికి గ్రౌండ్‌లో ఆ కసి తీర్చుకున్నట్లుగా కనిపిస్తోంది..! ఎందుకంటే జట్టు ప్రధాన ఆటగాడు, అప్పటి కెప్టెన్ అమరీందర్‌ను కాదని మరి.. సిద్ధువైపే మొగ్గుచూపిన సెలెక్టర్ల ఆశలను గాల్లో కలిపేశాడు. అమరీందర్ ఉండి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదేమో అనిపించేలా సాగింది కాంగ్రెస్ చెత్త ప్రదర్శన. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కాంగ్రెస్ ఆట ఇంత ఆధ్వానంగా మారడానికి అధిష్టాన నిర్ణయాలు కూడా ఒక బలమైన కారణమంటున్నారు.
Read More : Punjab AAP CM Candidate: పంజాబ్ సీఎం అభ్యర్థి ఇంట్లో జిలేబీలతో సంబరాలు
నాయకత్వం లోపం :-
అటు కెప్టెన్సీ లోపం లీగ్‌లో స్పష్టంగా కనిపించింది.! ఇక అదే సమయంలో ఆప్ తన టీమ్‌ను స్ట్రాంగ్ చేసుకుంది..! పర్‌ఫెక్ట్ గేమ్ ప్లాన్‌తో గ్రౌండ్‌లో అడుగుపెట్టింది..! ఆప్ జట్టుకు ప్రధాన బలం ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాలే..! ఢిల్లీలో తన బ్యాటింగ్, బౌలింగ్ విన్యాసాలతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన ఆయన.. పంజాబ్‌లో మెంటర్‌గా.. గ్యారీ కిరిస్టన్, జాన్‌రైట్‌లాగా అద్భుతమైన కోచ్‌లా అదరహో అనిపించాడు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం గ్రెగ్ చాపెల్ తరహా ఐడియాలతో గెలిచే కప్పును చేజేతులా చేజార్చుకుంది. కాంగ్రెస్‌లోనూ, ఆప్‌లోనూ ఆటంతా ఒక్కరిదే. అక్కడ టీమ్ మొత్తాన్ని సిద్ధూ ఓడిస్తే… ఇక్కడ కేజ్రీవాల్ జట్టు మొత్తాన్ని గెలిపించాడు. ఇప్పుడు రాజీనామా చేస్తానని సీఎల్పీకి సంకేతాలు పంపించాడు సిద్ధూ. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.