తీవ్ర విషాదం, కల్తీ మద్యానికి 86మంది బలి, మృతుల సంఖ్య పెరిగే అవకాశం

  • Publish Date - August 2, 2020 / 12:19 PM IST

పంజాబ్‌లో కల్తీ మద్యం కల్లోలం సృష్టిస్తోంది. కల్తీ మద్యం తాగిన వారు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. మూడు జిల్లాల్లో శుక్రవారానికి 39మంది చనిపోగా.. శనివారానికి(ఆగస్టు 1,2020) ఆ సంఖ్య గణనీయంగా పెరిగి 86కి చేరింది. నిన్న ఒక్కరోజే 47 మంది ప్రాణాలు వదిలారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అమృత్‌సర్, తర్ణ్ తారణ్, గురుదాస్‌పూర్ జిల్లాల్లో కల్తీ మద్యం మరణాలు సంభవిస్తున్నాయి. బుధవారం నుంచే కలుషిత మద్యం కారణంగా మరణాలు చోటుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంకా పలువురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కల్తీ మద్యానికి ఒక్క గ్రామంలోనే 63మంది మృతి:
ఒక్క తర్ణ్ తారన్ లోనే 63మంది ఈ నకిలీ మద్యానికి బలయ్యారంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ హెచ్చరించారు. ఇప్పటివరకు 25 మందిని అరెస్టు చేశారు. ఏడుగురు ఎక్సైజ్, ఆరుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. అమృత్ సర్ కేంద్రంగా కల్తీ మద్యం దందా నడుస్తోంది.

సీఎం అమరీందర్ సింగ్ సీరియస్:
ఈ ఘటనను పంజాబ్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సీఎం అమరీందర్ సింగ్ ఇప్పటికే మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 2లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అక్రమ మద్యం తయారీ కేంద్రాలపై దాడులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మరోవైపు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అక్రమ మద్యం తయారీ కేంద్రాలపై అధికారులు దాడులు చేస్తున్నారు. మూడు జిల్లాల పరిధిలో వందకి పైగా అక్రమ మద్యం తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. మద్యం నిల్వలను ధ్వంసం చేశారు. అలాగే అనుమతులు లేకుండా మద్యాన్ని తయారు చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు.

కల్తీ మద్యం అమ్మకాల్లో డాబా ఓనర్లే కీలకం:
పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో కల్లీ మద్యం ముఠా మాస్టర్ మైండ్, ఓ మహిళ, ట్రాన్స్ పోర్టు ఓనర్, వాంటెడ్ క్రిమినల్, పలు డాబాల మేనేజర్లు, ఓనర్లు ఉన్నారు. అక్రమ మద్యం తయారీ కేంద్రాల నుంచి డాబాలకు మద్యాన్ని సరఫరా చేసే వాళ్లని కూడా అదుపులోకి తీసుకున్నారు. జిల్ మిల్, గ్రీన్, చిందా డాబాలకు పోలీసులు సీల్ వేశారు. కల్తీ మద్యాన్ని ట్రక్కుల్లో తీసుకొస్తారని, వాటిని డాబాల దగ్గర నిలిపి ఉంచుతారని, డాబా ఓనర్లు ట్రక్కు డ్రైవర్ల నుంచి మద్యం కొనుగోలు చేస్తారని, దాన్ని సమీప గ్రామాల్లోని ప్రజలకు విక్రియిస్తారని పోలీసుల విచారణలో తెలిసింది. అమృత్ సర్ కేంద్రంగా కల్తీ మద్యం తయారీ అవుతోంది. అమృత్ సర్ దాని పరసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో అక్రమ మద్యం స్థావరాలు ఉన్నాయి. అక్కడి నుంచి మద్యం ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతోంది.