Udhayanidi Stalin: తమిళనాడు అసెంబ్లీలో పుష్ప ప్రస్తావన.. సోఫాలు పంపి ఎమ్మెల్యేల కొనుగోలు..! సీఎం విజయ్ పై సంచలన ఆరోపణలు
విజయ్ ప్రభుత్వానికి మెజార్టీ ఓటర్ల మద్దతు లేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేకు 35 శాతం మంది ఓటేయగా, 65 శాతం మంది వ్యతిరేకించారని తెలిపారు.
Udhayanidi Stalin: తమిళనాడు సీఎం విజయ్ పై ఉదయనిధి స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలను టీవీకే ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆరోపణలు గుప్పించారు. పుష్ప సినిమా తరహాలో కొందరు ఎమ్మెల్యేల ఇళ్లకు సోఫాలు చేరాయని, సోఫాల ద్వారా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని స్టాలిన్ అన్నారు. అయితే, ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలకు సీఎం విజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం తాము ప్రయత్నించలేదన్నారు. టీవీకే ఎలాంటి అడ్డదారులు తొక్కదని, తొక్కబోదని సీఎం విజయ్ తేల్చి చెప్పారు. సిద్ధాంతాలకు కట్టుబడి నడుచుకుంటామని స్పష్టం చేశారు.
తమిళనాడు అసెంబ్లీలో పుష్ప-2 సినిమా గురించి ప్రస్తావన వచ్చింది. అందులోని సోఫా సన్నివేశాన్ని ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ప్రస్తావించారు. బల పరీక్షకు ముందు మాట్లాడిన స్టాలిన్.. టీవీకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విజయ్ ప్రభుత్వానికి మెజార్టీ ఓటర్ల మద్దతు లేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేకు 35 శాతం మంది ఓటేయగా, 65 శాతం మంది వ్యతిరేకించారని తెలిపారు. గతంలో అన్నాడీఎంకే అవినీతికి పాల్పడిందని విమర్శలు చేసిన టీవీకే.. ఇప్పుడు ఆ పార్టీలోని ఓ వర్గం ఎమ్మెల్యేల మద్దతు తీసుకోవడం దారుణం అన్నారు.
అంతేకాదు ముఖ్యమంత్రి విజయ్‌పై ఘాటు విమర్శలు చేశారు ఉదయనిధి స్టాలిన్. విజయ్.. పుష్ప తరహా సోఫా సెట్ రాజకీయం చేశారని ఆరోపించారు. ముందు సోఫాని ఎమ్మెల్యేల ఇంటికి పంపారని, తర్వాతే పూల బొకేలతో సీఎం అక్కడికి వెళ్లారని చెప్పారు. పుష్ప-2 సినిమాలోని సోఫా సన్నివేశం తరహాలో ప్రభుత్వం సోఫా రాజకీయాల ద్వారా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని ఆరోపించారు.
పుష్ప 2 సినిమాలో వేరే వాళ్ల ఇంటికి వెళ్లడానికి ముందు.. డబ్బుల కట్టలతో నిండిన సోఫాని అక్కడికి పంపిస్తాడు హీరో. అలానే ఓ వ్యక్తిని సీఎంని చేసేందుకు ఎమ్మెల్యేలకు డబ్బులతో నిండిన సోఫా సెట్లని పంపుతాడు. ఇదే అంశాన్ని అస్త్రంగా చేసుకుని సీఎం విజయ్ ని కార్నర్ చేసే ప్రయత్నం చేశారు ఉదయనిధి స్టాలిన్. ఈ వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో హీట్ ను పెంచేశాయి.
Also Read: ప్రధాని మోదీ కాన్వాయ్ లో వాహనాల తగ్గింపు.. ఇప్పుడు రెండు కార్లే
