మోడీ జైలుకే: ఆధారాలు గట్టిగా ఉన్నాయ్

  • Published By: vamsi ,Published On : April 21, 2019 / 06:48 AM IST
మోడీ జైలుకే: ఆధారాలు గట్టిగా ఉన్నాయ్

Updated On : April 21, 2019 / 6:48 AM IST

సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్రంలోని అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కచ్చితంగా జైలుకి వెళ్తారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

చర్చల బృందాన్ని పక్కనపెట్టి మోడీ నేరుగా ‘డసో’ కంపెనీతో బేరసారాలు జరిపారని, మోడీని జైలుకు పంపేందుకు ఈ ఆధారాలు చాలునని రాహుల్ గాంధీ అన్నారు. ఐదేళ్లలో ప్రజల కొనుగోలు శక్తిని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని ఆరోపించారు. నిరుద్యోగం, రైతాంగ సంక్షోభం, అవినీతి లాంటి సమస్యలకు మోదీ పరిష్కారం చూపడంలో విఫలం అయ్యారని విమర్శించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కనీస ఆదాయ పథకం ‘న్యాయ్‌’ ఆర్థిక వ్యవస్థను ఘాడిలో పెడుతుందని రాహుల్ వెల్లడించారు. ఈ పథకం ఆర్థిక వ్యవస్థకు ఇంధనంలా పనిచేస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో దీని అమలు కోసం ప్రజలపై పన్ను భారం మోపబోమని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. దీంతో పేద ప్రజల చేతికి డబ్బు అందుతుందని, తద్వారా ఉత్పాదక రంగం ఊపందుకుంటుందని రాహుల్‌ చెప్పారు.