రజనీకాంత్ ను చంపేస్తామని బెదిరింపులు

  • Publish Date - January 26, 2020 / 06:24 AM IST

తమిళ్ సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో రాకముందే ఆయనపై రాజకీయ దాడి ప్రారంభమయ్యింది. ద్రవిడ పితామహుడు,  సంఘ సంస్కర్త  పెరియార్ రామసామి గురించి ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.  జనవరి నెల 14 న చెన్నైలో  జరిగిన తుగ్లక్ పత్రిక 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గోన్న ఆయన…  పెరియార్ గురించి అభ్యంతర కర వ్యాఖ్యలు చేసి ద్రవిడుల ఆగ్రహానికి గురయ్యాడు. అది ఇప్పుడు పెద్ద తల నొప్పిలా తయారయ్యింది. 

దీంతో ద్రవిడ విడుదలై కళగం, డీఎంకే వంటి పార్టీ నాయకులు రజనీపై మండి పడుతున్నారు. ఆయనపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదవుతున్నాయి.  క్షమాపణ చెప్పాలన్న డిమాండ్‌కు  రజనీకాంత్‌ తలొగ్గలేదు. పత్రికల్లో చదివిందీ, విన్నదే తాను చెప్పానని, సారీ చెప్పనని రజనీకాంత్‌ తెగేసి చెప్పారు. ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రజనీకాంత్‌పై హాత్యాబెదిరింపులు వస్తున్నాయంటూ సినోరా పీఎస్‌.అశోక్‌ అనే వ్యక్తి చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో శనివారం పిర్యాదు చేశారు. 

అందులో గత 22వ తేదీన స్థానిక తేనాపంపేట సమీపంలో సెంమొళి పూంగా వద్ద ద్రావిడ విడుదలై కళగంకు చెందిన కొందరు ఉమాపతి ఆధ్వర్యంలో  రజనీకాంత్‌కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. రజనీకాంత్‌ను ప్రాణాలతో నవడవనీయమని హెచ్చరించారన్నారు.  కాబట్టి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీస్‌ ఉన్నతాధికారులు విచారణ జరపాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.