గాంధీ ఫ్యామిలీకి కేంద్రం షాక్…ఆ 3 ట్రస్ట్ లపై విచారణకు ప్రత్యేక కమిటీ

గాంధీ కుటుంబానికి కేంద్రం షాకిచ్చింది. గాంధీ కుటుంబానికి సంబంధించిన మూడు ట్రస్టులపై విచారణకు కేంద్రహోంశాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ మూడు ట్రస్టుల్లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అవకతవకలు జరిగాయని, అందుకే వాటిపై దర్యాప్తు చేయించబోతున్నామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్‌లు ఐటీశాఖ చట్టం, PMLA, FCRA వంటి చట్టాలను ఉల్లఘించాయని ఆరోపణలున్నాయి. వాటికి చైనా ఎంబసీ నుంచి నిధులు వచ్చాయని బీజేపీ నేతలు సైతం ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఆయా ట్రస్ట్‌ల అక్రమ లావాదేవీలపై విచారణకు అంతర్ మంత్రిత్వ కమిటీని కేంద్రహోంశాఖ నియమించింది. ఈ కమిటీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) స్పెషల్ డైరెక్టర్‌కు నేతృత్వం వహిస్తారు.
భారత్, చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో కేంద్రమంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ సహా పలువురు నేతలు సంచలన ఆరోపణలు చేశారు. చైనాతో రాహుల్ గాంధీ ఫౌండేషన్‌కు సంబంధాలున్నాయని.. చైనా ఎంబసీ నుంచి ఆ ఫౌండేషన్‌కు పెద్ద మొత్తంలో నిధులు అందుతున్నాయని ఆరోపించారు. ఈ సంబంధాల వల్ల కాంగ్రెస్ అగ్రనేతలు చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు.
యూపీఏ హయాంలో మన్మోహన్ ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు విరాళం ఇచ్చిందని బీజేపీ ఆరోపించింది. యూపీఏ హయంలో ఆపదలో ఉన్న ప్రజలకు ఉద్దేశించిన పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ (ఆర్‌జీఎఫ్)కు విరాళం ఇచ్చారని బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆరోపించారు. ఈ క్రమంలోనే గాంధీ కుటుంబానికి చెందిన చారిటబుల్ ట్రస్ట్‌లపై విచారణకు ప్రత్యేక కమిటీని నియమించడం చర్చనీయాంశమైంది.
కాగా, బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేస్తున్నది. చైనాతో సరిహద్దు వ్యవహారంలో కేంద్రప్రభుత్వ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని మండిపడింది. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు సోనియాగాంధీ చైర్మన్‌గా ఉండగా.. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, పీ చిదంబరం, మన్మోహన్ సింగ్ సభ్యులుగా ఉన్నారు.