RBI: బ్యాంకు ఏదైనా ఖాతాలకు సంబంధించి కస్టమర్లు మినిమం బ్యాలెన్స్ మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. బ్యాంకు నిబంధనల ప్రకారం అది మస్ట్. అయితే మినిమం బ్యాలెన్స్ ఎంత ఉండాలి? అది ఎవరు డిసైడ్ చేస్తారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడీ చర్చకు కారణం.. దేశంలో 2వ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ‘ఐసీఐసీఐ’ తీసుకున్న సంచలన నిర్ణయమే. మినిమమ్ బ్యాలెన్స్ రూ.50 వేలకు పెంచుతూ ఐసీఐసీఐ కీలక సవరణ చేసింది. సేవింగ్స్ ఖాతాలకు మినిమం మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ (MAB)ను గణనీయంగా పెంచుతున్నట్లు పేర్కొంది.
దీంతో మినిమం బ్యాలెన్స్ అంశం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఇది అన్యాయం అని కస్టమర్లు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో ఆర్బీఐ, కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయో ఆయన వివరించారు.
పొదుపు ఖాతాలకు కనీస సగటు బ్యాలెన్స్ (MAB) నిర్ణయించడంలో బ్యాంకులకు పూర్తి స్వయంప్రతిపత్తి ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తేల్చి చెప్పింది. ఈ సమస్య కేంద్ర బ్యాంకు నియంత్రణ పరిధిలోకి రాదని అన్నారు. ”సేవింగ్స్ అకౌంట్స్ కి సంబంధించి వ్యక్తిగత బ్యాంకులు స్వతంత్రంగా కనీస సగటు బ్యాలెన్స్ (MAB) అవసరాలను నిర్ణయించుకోవచ్చు. ఎందుకంటే ఈ విషయం కేంద్ర బ్యాంకు నియంత్రణ పరిధికి వెలుపల ఉంది” అని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు.
“కనీస సగటు బ్యాలెన్స్ ని నిర్ణయించే బాధ్యతను ఆర్బీఐ బ్యాంకులకే వదిలేసింది” అని మల్హోత్రా తెలిపారు. “కొన్ని బ్యాంకులు దానిని 10వేలకి, మరికొన్ని 2వేలకి పరిమితం చేశాయి. మరికొన్ని దానిని పూర్తిగా తొలగించాయి” అని ఆర్బీఐ గవర్నర్ గుర్తు చేశారు.
ఆగస్టు 1 నుండి ICICI బ్యాంక్ పట్టణ, మెట్రో ప్రాంతాలలో కొత్త కస్టమర్లకు MAB అవసరాన్ని రూ. 50వేలకు పెంచింది. ఈ బ్యాలెన్స్‌ను మెయింటేన్ చేయడంలో విఫలమైన కస్టమర్లు.. లోటులో 6శాతం లేదా రూ. 500, ఏది తక్కువైతే అది జరిమానాను ఎదుర్కొంటారు.
ఈ చర్య అనేక ప్రభుత్వ యాజమాన్య బ్యాంకుల విధానానికి విరుద్ధంగా ఉంది. కాగా, బ్యాంకు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ నిర్వహించనందుకు జరిమానాలను రద్దు చేసిన మొదటి బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, డియన్ బ్యాంక్ కూడా అదే బాటలో నడిచాయి.
అయితే, చాలా ప్రైవేట్ రంగ బ్యాంకులు ఛార్జీలు విధిస్తూనే ఉన్నాయి. సాధారణంగా అవసరమైన MAB లో 6% లేదా త్రైమాసికానికి రూ. 500, ఏది తక్కువైతే అది. అదనంగా, మారుతున్న మార్కెట్ పరిస్థితుల మధ్య మార్జిన్‌లను కాపాడుకోవడానికి చాలా బ్యాంకులు ఇటీవల సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి.
ఇక ఐసీఐసీఐ కొత్త రూల్ ప్రకారం.. మెట్రో, పట్టణ శాఖలలోని వినియోగదారులు మినిమం బ్యాలెన్స్ రూ. 50వేలు నిర్వహించాలి. గతంలో ఈ బ్యాలెన్స్ 10వేలుగా ఉండేది. సెమీ అర్బన్ ప్రాంతాలలో కస్టమర్లు బ్యాలెన్స్ రూ. 5వేల నుంచి రూ. 25వేలకు పెరిగింది. గ్రామీణ ఖాతాలను రూ. 2500 నుంచి రూ. 10వేలకు పెంచింది. ఖాతాదారులు ఈ బ్యాలెన్స్ ఉండేలా చూసుకోకపోతే.. జరిమానాలు చెల్లించాల్సిందే.