Who Replace Mukesh Ambani: రిలయన్స్ పగ్గాలు ఎవరికీ? ముఖేష్ అంబానీ కీలక ప్రకటన!

యువ తరానికి పగ్గాలను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.

Mukesh Ambani

Who Replace Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. సీనియర్ సహోద్యోగులతో పాటు యువ తరానికి పగ్గాలను అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. 64 ఏళ్ల ముఖేష్ అంబానీ, తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారసత్వాన్ని అందజేసే ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించారు.

“పెద్ద కలలు, అసాధ్యమైన లక్ష్యాలను సాధించడానికి సరైన వ్యక్తులను నియమించడం.. సరైన నాయకత్వం అందించడం అవసరం” అని అంబానీ చెప్పాడు. రిలయన్స్‌లో గణనీయమైన నాయకత్వ మార్పు జరుగుతుందని, తనతో పాటు, సీనియర్‌ వ్యక్తులు యువ నాయకులు అందరినీ మార్చే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు అంబానీ.

అంబానీ ఈ ప్రకటన చేసిన తర్వాత రిలయన్స్ గ్రూప్ లీడర్‌షిప్ ఎవరిని వరిస్తుంది అని ప్రతీఒక్కరూ ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు పోటీలో ఉన్నారు. ముఖేష్ అంబానీ పిల్లలైన ఇషా, ఆకాష్, అనంత్‌లలో సింహాసనం ఎవరికి దక్కుతుంది? లేక అందరికీ సమానంగా దక్కుతుందా? కంపెనీలో ముగ్గురు పిల్లల బాధ్యత ఏమిటి? అనేది ఇప్పుడు చర్చనీయాంశం.

ముఖేష్ అంబానీ పిల్లల్లో ఇషా అంబానీ గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఆమె యేల్ విశ్వవిద్యాలయం నుంచి పట్టా పుచ్చుకోగా.. 2014 నుంచి రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. అదే సమయంలో, ఆమె రిలయన్స్ ఫౌండేషన్‌లో అదనపు డైరెక్టర్ పాత్రలో కూడా ఉన్నారు. గత రెండేళ్లలో ఆమె పాత్ర కూడా బలంగా ఉంది. జియో ప్లాట్‌ఫారమ్‌లలో ఫేస్‌బుక్ 9.99 శాతం వాటాను కొనుగోలు చేసిన ఇషా అంబానీ ముఖ్యమైన పాత్ర పోషించారు. అంతేకాదు.. ఆమె రిలయన్స్ ఫ్యాషన్ పోర్టల్ అజియో, ఈకామర్స్ వెంచర్ జియోమార్ట్‌లను కూడా పర్యవేక్షిస్తుంది.

ఆకాష్ అంబానీ: జియోలో కీలక పాత్ర నుండి స్పోర్ట్స్ ఫ్రాంచైజీ వరకు..
ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ రిలయన్స్ జియోలో డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కూడా. అతను రిలయన్స్ జియో స్ట్రాటజీ హెడ్‌గా కూడా ఉన్నారు. 2014లోనే కంపెనీలో చేరిన ఆకాష్.. రిలయన్స్ జియో గవర్నింగ్, ఆపరేటింగ్ బాడీలో కీలకంగా ఉన్నాడు. మెసేజింగ్, చాట్‌తో సహా రిలయన్స్ జియో అప్లికేషన్‌ల అభివృద్ధితో పాటు ఇతర సేవలను పర్యవేక్షిస్తాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టు విషయంలో కీలక పాత్ర పోషించాడు. ఇండియా సూపర్ లీగ్ ఆఫ్ ఫుట్‌బాల్‌లో కూడా కీలకంగా ఉన్నాడు. ఒకరకంగా చెప్పాలంటే, స్పోర్ట్స్ ఫ్రాంచైజీని అతనే నిర్వహిస్తున్నాడు. టెక్ దిగ్గజాలతో ఒప్పందాలు చేసుకోవడంలో ఇషా అంబానీతో కలిసి పనిచేస్తున్నాడు. ఆకాష్ అంబానీ బ్రౌన్ యూనివర్శిటీలో చదువు పూర్తి చేశారు.

అనంత్ అంబానీ: గ్రీన్ ఎనర్జీ బిజినెస్ నుండి గుజరాత్‌లోని జూ ప్రాజెక్ట్ వరకు..
బ్రౌన్ యూనివర్సిటీలో చదివిన అనంత్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌లో కీలక పాత్ర పోషించారు. రిలయన్స్ గ్రీన్ బిజినెస్ కంపెనీలైన రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్, రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీలకు అతనే డైరెక్టర్. అనంత్ అంబానీ ఫిబ్రవరిలో రిలయన్స్ O2C డైరెక్టర్‌గా కూడా నియమితులయ్యారు. ఒక సంవత్సరం క్రితం, అనంత్ జియో ప్లాట్‌ఫారమ్‌ల బోర్డులోకి ఎంట్రీ ఇచ్చారు. అంతే కాదు, గుజరాత్‌లోని రిలయన్స్ జూ ప్రాజెక్ట్‌ను కూడా అనంత్ అంబానీనే పర్యవేక్షిస్తున్నాడు.

అయితే, తన ప్రసంగంలో ఇషా భర్త ఆనంద్‌ పిరమాల్‌, ఆకాశ్‌ భార్య శ్లోక, రాధిక(అనంత్‌ కాబోయే భార్య అని ప్రచారం ఉంది), పృథ్వీ(ఆకాశ్‌, శ్లోకల కుమారుడు)ల గురించి ముఖేష్ అంబానీ ప్రస్తావించారు. భవిష్యత్‌లో ప్రపంచంలోనే తొలి మూడు ఆర్థిక వ్యవస్థలో భారత్‌ ఒకటిగా నిలబడగలదని అంచనా వేశారు. అంబానీకి ఇద్దరు కుమారులు(ఆకాశ్‌, అనంత్‌), ఒక కుమార్తె(ఇషా) కాగా.. అందులో ఆకాశ్‌, ఇషాలు కవలలు.