Kuno National Park Cheetah Deaths
Kuno National Park Cheetah Deaths : భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రాజెక్ట్ చీతా’(Project Cheetah)తో ఆఫ్రికాలోని నమిబియా దేశం నుంచి చీతాలను తీసుకొచ్చిన చీతాల మరణఘోష కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో ఆఫ్రికన్ చీతాలు ఒక్కటొక్కటిగా మృత్యువాత పడుతున్నాయి. ఆఫ్రియా నుంచి 20 చీతాలను తీసుకురాగా వాటిలో ఇప్పటికే ఎనిమిది చీతాలు మరణించాయి. మిగిలిన చీతాల ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆందోళన నెలకొంది. అవన్నా బతుకుతాయా? అంటే ఆలోచించాల్సిన పరిస్థితి. మరి ఈ చీతాలు ఎందుకు మరణిస్తున్నాయి? దానికి కారణమేంటీ..? అనే అనుమానాలు వస్తున్నాయి.
ప్రధాని మోదీ ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆఫ్రికా దేశం నుంచి రెండు విడతల్లో నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి 20 చీతాలను తీసుకురాగా ఇప్పటి వరకు 8 మృతి చెందాయి. చీతాలు మృత్యువాత పడటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆఫ్రికా వాతావరణ పరిస్థితుల నుంచి ఈ చీతాలు భారత వాతావరణ పరిస్థితులకు అలవాటు పడలేకపోతున్నాయా? లేదా అక్కడి ఆహార విధానానికి ఇక్కడి ఆహార విధానానికి తేడాల వల్లే చనిపోతున్నాయా? లేదా తగినంత జాగ్రత్తలు తీసుకోలేదా..? అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో వాటికి అమర్చిన ‘రేడియో కాలర్’ (radio collar)వల్లే ప్రాణాలు కోల్పోతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Cheetah Deaths : కునో నేషనల్ పార్కులో వరుసగా చీతాల మృతి.. చిరుతల మరణాలకు కారణమేంటి?
కానీ చీతాలు ఇక్కడి వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక పోవడం వల్లే మృతి చెందుతున్నాయని అధికారులు చెప్పినా ..చీతాలకు అమర్చిన రేడియో కాలర్ వల్లే ప్రాణాలు కోల్పోతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అవి నిజమనేలా కొన్ని ఘటనలు చోటుచేసుకోవటం గమనించాల్సిన విషయంగా కనిపిస్తోంది.
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని కునో నేషనల్ పార్కు( Kuno National Park)లో వదలిన పవన్ (ఒబన్) అనే చిరుత తాజాగా అనారోగ్యానికి గురైంది. దానిని ఎన్‌క్లోజర్‌లోకి తీసుకొచ్చిన అధికారులు ప్రత్యేక వైద్య బృందంతో పరీక్షలు నిర్వహించారు. చీతా కదలికలను పసిగట్టటానికి ఏర్పాటు చేసిన రేడియో కాలర్ వల్లే ఇలా జరుగుతోందని నిపుణులు గుర్తించినట్లుగా సమాచారం. చీతా కదలికలను పసిగట్టటానికి దాని మెడకు అమర్చిన రేడియో కాలర్ కింద గాయాలైనట్లు గుర్తించారు.
ఆ గాయాల్లో చిన్న చిన్న పురుగులు కూడా ఉన్నట్లుగా అధికారులు నిర్ధారించారు. దీంతో ఆందోళన చెందిన అధికారులు ఆ రేడియో కాలర్స్ ఐడీ ట్యాగ్‌ను తీసివేసి చికిత్స చేశారు. మరో రెండు చీతాలకు కూడా ఇదే రకమైన గాయాలైనట్లుగా గుర్తించటంతో ఈ రేడియో కాలర్ వల్లే చీతాలు గాయాలైనట్లుగా గుర్తించారు. దీంతో రేడియో కాలర్స్ వల్ల గాయాలు కావటం..సరైన సమయంలో చికిత్స అందక మరణించినట్లుగా తెలుస్తోంది. దీంతో నలుగురు సభ్యుల బృందం కునో నేషనల్ పార్కులోనే ఉంటు చీతాల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తోంది. మిగిలిన చీతాలకు ప్రాణగండం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Cheetah: నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చీతా.. తల్లీ, పిల్లలు క్షేమం.. వైరల్ వీడియో
ఈ క్రమంలో గ్వాలియర్, భోపాల్ నుంచి మరో నలుగురు వైద్యుల బృందాన్ని కేంద్రం కునో నేషనల్ పార్కుకు పంపింది. అన్ని చీతాలను తిరిగి ఎన్‌క్లోజర్లలోకి తీసుకొచ్చి పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత తిరిగి విడిచిపెట్టనున్నారు. ఇకపై వాటి కదలికలను పసిగట్టేందుకు రేడియో కాలర్ బదులు డ్రోన్‌లను ఉపయోగించే అవకాశం ఉంది.
కాగా చీతాల మరణానికి గల కారణాలను పరిశోధించడానికి అంతర్జాతీయ చిరుత నిపుణులు,దక్షిణాఫ్రికా, నమీబియా నుండి వెటర్నరీ వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రిత్వ శాఖ తెలిపింది. కేంద్రం చిరుత ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీ ప్రాజెక్ట్ పురోగతిని నిశితంగా పరిశీలిస్తోందని..అమలు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిందని పేర్కొంది. క్షేత్రస్థాయి అధికారులతో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) నుండి ఒక ప్రత్యేక బృందాన్ని నియమించింది.
కాగా చీతాలను తీసుకొచ్చి ఏడాది పూర్తి కాకుండానే ఎనిమిది చీతాలు మరణించటం మిగిలిన చీతాల గురించి ఆందోళనకరంగా మారింది. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా గత సెప్టెంబర్ లో ఆయన చేతులతో స్వయంగా కునో నేషనల్ పార్కులో చీతాలను ఎన్ క్లోజర్లలోకి వదిలిపెట్టారు. ఆతరువాత వాటి కదలికలపైనా..వాటి ఆరోగ్యంపైనా..ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈక్రమంలో గత మార్చి(2023)లో సియాయా అనే మూడేళ్ల చీతా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో విదేశీ చీతాలు ఇక్కడి వాతావరణానికి బాగా అలవాటు పడ్డాయని. ఇక భారత్ లో చీతాల సంఖ్య పెరుగుతుందని భావించారు. కానీ వరుసగా చీతాల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.