Cheetah Deaths : కునో నేషనల్‌ పార్కులో వరుసగా చీతాల మృతి.. చిరుతల మరణాలకు కారణమేంటి?

నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన వాటిలో మూడు చీతాలు ఇటీవలే వేర్వేరు కారణాల వల్ల మరణించగా.. ఇప్పుడు చీతా పిల్లల మృతితో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.

Cheetah Deaths : కునో నేషనల్‌ పార్కులో వరుసగా చీతాల మృతి.. చిరుతల మరణాలకు కారణమేంటి?

Cheetah Deaths – Kuno National Park : ప్రాజెక్టు చీతాలో భాగంగా భారత్‌కు తీసుకొచ్చిన ఆఫ్రికన్ చిరుతలు (African cheetah) ఎందుకు చనిపోతున్నాయి..? కునో నేషనల్ పార్క్‌లో చీతాల వరుస మరణాలకు అసలు కారణం ఏంటి..? ఆఫ్రికా, భారత్‌ మధ్య వాతావరణం (climate)లో ఉన్న తేడా వల్లే చీతాలు చనిపోతున్నాయా.. లేక వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా..? ఇండియా (India) లో చీతాల సంతతి పెంచాలనుకున్న నిర్ణయంలో లోపాలేంటి..? దీనిపై నిపుణులు ఏమంటున్నారు..?

ప్రాజెక్టు చీతాపై నీలినీడలు
ఇండియాలో చీతాల సంఖ్య పెంచేందుకు చేపట్టిన ప్రాజెక్టు చీతా (project cheetah) పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి చీతాలతో పాటు వాటి కూనలు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) లోని కునో నేషనల్ పార్కులో రెండు రోజుల వ్యవధిలో మూడు చీతా కూనలు మరణించాయి. నమీబియా (Namibia), దక్షిణాఫ్రికా (South Africa) నుంచి తీసుకొచ్చిన వాటిలో మూడు చీతాలు ఇటీవలే వేర్వేరు కారణాల వల్ల మరణించగా.. ఇప్పుడు చీతా పిల్లల మృతితో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. చీతా కూనల మరణానికి ప్రతికూల వాతావరణ పరిస్థితులు, డీహైడ్రేషన్‌ కారణంగా చెబుతున్నారు.

రెండు రోజుల వ్యవధిలో మూడు చీతా కూనల మరణం
నమీబియా నుంచి తీసుకొచ్చిన జ్వాల అనే చీతాకు రెండు నెలల క్రితం నాలుగు పిల్లలు పుట్టాయి. ఇటీవల కునో జాతీయ పార్కు ప్రాంతంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ పరిస్థితుల కారణంగా చీతా కూనలు డీహైడ్రేషన్‌కు గురైనట్టు గుర్తించారు. వాటికి అవసరమైన చికిత్స అందించారు. అయినా పరిస్థితి విషమించి చనిపోయాయి. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండు విడతల్లో నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి 20 చీతాలను భారత్‌కు తీసుకొచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాల్లో ఒకటైన ఆడ చీతా దక్ష ఈ నెల 9న మృతి చెందింది. అంతకుముందు నమీబియా నుంచి తీసుకొచ్చిన సాశా అనే ఆడ చీతా మార్చి 27న, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఉదయ్‌ అనే మగ చీతా ఏప్రిల్‌ 23న మృతి చెందింది.

రాబోయే రోజుల్లో చీతాలకు మరింత రిస్క్!
చీతాల మరణానికి వాతావరణ ఒక కారణంగా చెబుతున్నా.. ఇతర సమస్యలు కూడా ఉన్నాయంటోంది సౌతాఫ్రికా ఫారెస్ట్‌, ఫిషరీస్‌, ఎన్విరాన్‌మెంట్‌ విభాగం. ఈ ప్రాజెక్టును చేపట్టినప్పుడే.. మరణాలను తాము ముందే ఊహించామంటోంది. సాధారణంగా వాతావరణ మార్పులను చీతాలు ఒక్కసారిగా తట్టుకోలేవు. విపరీతమైన మార్పుల కారణంగా అవి వెంటనే చనిపోతాయి. దీనికి తోడు చీతాలు సంచరించేందుకు కావాల్సినంత స్థలం లేదంటున్నారు నిపుణులు.

Also Read: ఒక్క హగ్ బ్యాంక్ దోపిడి ఆపేసింది.. ఎలాగో తెలుసా!

నమీబియాలో చీతాల సంఖ్యకు అనుగుణంగా ఒక చీతాకు 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. అయితే కునో నేషనల్ పార్కు మొత్తం విస్తీర్ణం 750 చదరపు కిలోమీటర్లు మాత్రమే. ఇక్కడే మొత్తం 20 చీతాలను ఉంచారు. అంటే నమీబియాలో ఒక చీతా ఉండే ప్రాంతంలో.. భారత్‌లో మూడు చీతాలను ఉంచారు. దీని వల్ల వేట విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని ఆఫ్రికన్ నిపుణులు చెబుతున్నారు. అయితే కునో నేషనల్ పార్కులో జంతువుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల.. చీతాలకు వేట సమస్య రాదని ప్రాజెక్ట్ చీతా సభ్యులు భావిస్తున్నారు. కాని ఆ లెక్క తప్పని ఆఫ్రికన్ చీతా నిపుణులు అంటున్నారు. కునో నేషనల్ పార్క్‌లో చర్యల వల్ల రాబోయే రోజుల్లో చీతాలకు మరింత రిస్క్ ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

చీతాలకు రక్షణ కరవు!
కునో నేషనల్ పార్కులో చీతాలను ఉంచిన విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయంటోంది సౌతాఫ్రికా ఫారెస్ట్‌, ఫిషరీస్‌, ఎన్విరాన్‌మెంట్‌ విభాగం. సౌతాఫ్రికాలో చీతాలను భారీ ఎన్‌క్లోజర్‌లో ఉంచుతారు. రోజుకు రెండుసార్లు వాటిని పరిశీలిస్తారు. ఒకవేళ అడవిలో ఉంటే.. బృందాలు అనుసరిస్తూ ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షిస్తుంటాయి. కానీ కునో ప్రాంతంలో చీతాలకు రక్షణ లేదంటున్నారు ఆఫ్రికన్ నిపుణులు. చీతాలకు పోటీగా చిరుతలు, తోడేళ్లు, ఎలుగు బంట్లు సంచరిస్తుంటాయి. వాటి నుంచి కూడా ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందంటున్నారు. అందుకే వాటిని దగ్గరగా ఉండి పర్యవేక్షించడమే మంచిదని కునో అధికారులకు సౌతాఫ్రికా అటవీ అధికారులు సూచిస్తున్నారు.

ముకుంద్రా హిల్స్‌కు తరలిస్తే సేఫ్!
మరోవైపు ఫ్రీఎన్‌క్లోజర్లలోకి వదలిపెట్టిన తర్వాత కునో నేషనల్‌ పార్కు సరిహద్దులను దాటి వెళ్లిపోతున్న చీతాలు తిరిగి ఎలా లోపలికి రావాలో తెలియక ఇబ్బందులు పడుతున్నాయి. కునో నేషనల్ పార్క్ చుట్టూ చిన్నచిన్న అటవీ గ్రామాలు ఉన్నాయి. చీతాలు పొరపాటున అక్కడకు వెళ్తే వాటికి ప్రాణహాని ఉండొచ్చని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో చీతాలను కునో నేషనల్ పార్క్ నుంచి మరో చోటుకు తరలించాల్సిన అవసరం ఉందంటున్నారు.

Also Read: అమూల్‌తో దక్షిణాది రాష్ట్రాల మిల్క్ వార్.. ఇంతకీ సమస్య ఏంటి.. తమిళనాడు ఎందుకు వద్దంటోంది?

ఇదే విషయాన్ని భారత్‌లోని నిపుణులు సూచించారు. కునో నేషనల్ పార్కులో చీతాల సంచరానికి.. వాటిని పర్యవేక్షించేందుకు సరిపడా ప్రాంతం లేకపోవడంతో వేరే చోటుకు తరలించాలని కోరారు. ఇదే విషయంపై గత నెల మధ్యప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ కూడా నేషనల్ టైగర్ కంజర్వేషన్ అథారిటీకి లేఖ రాసింది. చీతాలకు ప్రత్యామ్నాయ ప్రాంతం కావాలని కోరింది. ఇలాంటి సమయంలోనే రాజస్థాన్‌లోని ముకుంద్రా హిల్స్‌ (Mukundara Hills National Park) కు చీతాలను తరలించాలనే వాదన వినిపిస్తోంది. అక్కడ విస్తీర్ణం, రక్షణ పరంగా చీతాలు సేఫ్‌గా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. కనీసం మూడు నాలుగు చీతాలనైనా ముకుంద్రా హిల్స్‌కు తరలించి.. అక్కడ సంతనోత్పత్తి జరిగేలా చూసుకోవాలంటున్నారు. లేకపోతే ప్రాజెక్ట్ చీతాకు రాబోయే రోజుల్లో మరిన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందంటున్నారు.