Amul vs Aavin: అమూల్‌తో దక్షిణాది రాష్ట్రాల మిల్క్ వార్.. ఇంతకీ సమస్య ఏంటి.. తమిళనాడు ఎందుకు వద్దంటోంది?

సౌత్ ఇండియాపై అమూల్ ఫోకస్ పెంచింది. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని.. పనులు కూడా మొదలు పెట్టింది. అయితే కర్ణాటక, తమిళనాడులో మాత్రం అమూల్‌ విస్తరణకు వ్యతిరేకత వస్తోంది.

Amul vs Aavin: అమూల్‌తో దక్షిణాది రాష్ట్రాల మిల్క్ వార్.. ఇంతకీ సమస్య ఏంటి.. తమిళనాడు ఎందుకు వద్దంటోంది?

Amul vs Aavin Milk Row: నిన్న కర్ణాటక (Karnataka).. నేడు తమిళనాడు (Tamil Nadu). వరుసగా ఒకదాని తర్వాత మరొకటి దక్షిణాది రాష్ట్రాలు గుజరాత్‌ (Gujarat)కు చెందిన పాల సహకార సంఘం అమూల్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి. అసలు అమూల్‌తో వచ్చిన సమస్య ఏంటి..? అమూల్ వ్యవహారం ఎందుకు రాజకీయ రంగు (Political Colour) పులుముకుంటోంది..? ఇది వ్యాపార సమస్యా.. లేక రాజకీయ సమస్యా..?

అమిత్‌షాకు సీఎం స్టాలిన్ లేఖ
గుజరాత్‌కు చెందిన పాల సహకారం సంఘం అమూల్ దక్షిణాది విస్తరణ ప్రయత్నాలకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పాడుతున్నాయి. ఎన్నికలకు ముందు కర్ణాటకలో.. ఇప్పుడు తమిళనాడులో అమూల్ వ్యాపార కార్యకలాపాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు. తాజాగా తమిళనాడు పాల సహకార సంఘం ఆవిన్‌‌కు ఉన్న మిల్క్ షెడ్ ఏరియా నుంచి పాలను అమూల్ సేకరించడంపై వివాదం రేగింది. అమూల్ ఇలా పాలను సేకరించకుండా చూడాలని ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా (Amit Shah)కు లేఖ రాశారు సీఎం స్టాలిన్ (CM Stalin). ఆవిన్ పరిధిలో అమూల్ పాలు సేకరిస్తే.. అనారోగ్యకరమైన పోటీ ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు స్టాలిన్. రెండు పాల సహకార సంఘాల మధ్య పోటీ ఏ మాత్రం మంచిది కాదన్నారు. ఇది పూర్తిగా శ్వేత విప్లవం విధానాలకు విరుద్ధమన్నారు. దీనిపై కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు స్టాలిన్.

శ్వేత విప్లవం విధానాలకు విరుద్ధం
ఇప్పటి వరకు తమిళనాడు కేవలం ఔట్‌లెట్లతోనే తన ఉత్పత్తులను అమ్ముతోంది అమూల్. అయితే ఇప్పుడు అమూల్‌కు ఉన్న మల్టీ స్టేట్ లైసెన్స్‌ను ఉపయోగించుకుని, కృష్ణగిరి జిల్లాలో చిల్లింగ్ సెంటర్లను, ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. తమిళనాడులోని కృష్ణగిరి, ధర్మపురి, వెల్లూరు, రాణీపేట, తిరుపత్తూరు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో పాలను సేకరించాలని ప్రణాళికలు రూపొందించింది. దీనిపై తమిళనాడు సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఒక సహకార సంస్థకు చెందిన పరిధిలోకి మరొకటి రాకుండా వృద్ధి చెందాలనేది.. శ్వేత విప్లవం సూత్రం. అయితే దీనికి విరుద్ధంగా అమూల్ వ్యవహరిస్తోంది అనేది స్టాలిన్ ఆరోపణ.

Also Read: మోదీ పాలనలో ఏయే ఏడాది.. ఏయే కీలక ఘట్టం? పూర్తి వివరాలు

తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆవిన్
1970లో భారత్‌లో మొదలైన ఆపరేషన్ వైట్ ఫ్లడ్ ప్రాజెక్టు ద్వారా అత్యధిక పాల ఉత్పత్తిదారుగా మారింది. అయినప్పటికీ దేశంలో ఇంకా పాల కొరత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అమూల్ ఈ విధంగా ఆవిన్ పరిధిలోకి వచ్చి పాలన సేకరిస్తే సమస్యలు మరింత పెరుగుతాయని తమిళనాడు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆవిన్ నడుస్తోంది. తమిళనాడు సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్య లిమిటెడ్ ఆవిన్ కోఆపరేటివ్ పేరుతో పాలన సేకరిస్తున్నారు. గ్రామీణ పాల ఉత్పత్తిదారులు, వినియోగదారుల ప్రయోజనాల కోసం సుమారు 9 వేలకు పైనే పాల ఉత్పత్తిదారుల సహకార సొసైటీలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు అమూల్ ఎంట్రీతో ఈ సొసైటీలు నష్టపోతాయంటున్నారు సీఎం స్టాలిన్.

Also Read: రాహుల్ గాంధీ కాస్త సీరియస్‌గా ట్రై చేస్తే.. మొత్తం సీనే మారిపోతుందా?

రూల్స్ ప్రకారమే వ్యాపార విస్తరణ: అమూల్‌
మరోవైపు అమూల్ మాత్రం రూల్స్ ప్రకారమే వ్యాపార విస్తరణకు నిర్ణయాలు తీసుకుంటున్నామంటోంది. అమూల్ పేరుతో గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ పెడరేషన్ ఎన్నో ఏళ్లుగా పాల వ్యాపారం చేస్తోంది. దేశ వ్యాప్తంగా పాల వ్యాపారం ద్వారా 55 వేల కోట్ల రూపాయల రెవెన్యూ అమూల్‌కు వస్తోంది. అలాగే అమూల్ గ్రూప్ టర్నోవర్ 72 వేల కోట్ల రూపాయలుగా ఉంది. దీనిని మరింత పెంచాలనే లక్ష్యంతో సౌత్ ఇండియాపై అమూల్ ఫోకస్ పెంచింది. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని.. పనులు కూడా మొదలు పెట్టింది. అయితే కర్ణాటక, తమిళనాడులో మాత్రం అమూల్‌ విస్తరణకు వ్యతిరేకత వస్తోంది. అమూల్ రాకతో స్థానిక పాల సహకార సంఘాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటకలో అమూల్ పాల వ్యాపారంపై ఎందుకు అభ్యంతరం వ్యక్తమైంది?.. వివరాలకు ఈ వీడియో చూడండి..