రిపబ్లిక్ డే : ఉగ్ర కుట్ర భగ్నం: ఇద్దరు అరెస్ట్ 

  • Published By: veegamteam ,Published On : January 25, 2019 / 06:10 AM IST
రిపబ్లిక్ డే : ఉగ్ర కుట్ర భగ్నం: ఇద్దరు అరెస్ట్ 

ఢిల్లీ : రిపబ్లిక్ డే సందర్భంగా దేశమంతా అలెర్ట్ అయ్యింది. ఈ సందర్భంగా భారత్ పై దాడులకు టెర్రరిస్టులు కుట్ర పన్నారు. ఈ సమాచారంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఉగ్రవాదుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పేలుడు పదార్థాలతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం కలిగించేందుకు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ప్లాన్ గుర్తించిన మిలటరీ ఇంటలిజెన్స్ వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. జనవరి 25 ఉదయం అబ్దుల్ లతీఫ్ ఘనీ, హిలాల్ అహ్మద్ భట్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని వీరి ఇంటి నుంచి పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

లతీఫ్, భట్ ల స్వస్థలం జమ్మూకశ్మీర్ లోని బందిపొరా అని అధికారులు తెలిపారు. గణతంత్ర దినోత్సవం వేళ ఢిల్లీలో భారీ బీభత్సం సృష్టించేందుకు కుట్ర పన్నారని వ్యాఖ్యానించారు. వీరిద్దరూ ఢిల్లీలోని లక్ష్మీనగర్ లో నివాసం ఉంటున్నారని అన్నారు. వీరి సహచరులను పట్టుకోవడానికి అధికారులు రంగంలోకి దిగారన్నారు.ఢిల్లీలో దాడి కుట్రలో వీరిద్దరే ఉన్నారా? మిగతా నగరాల్లోనూ ఈ ఉగ్రసంస్థ దాడులకు కుట్ర పన్నిందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. త్వరలోనే మరిన్ని విషయాలు చెబుతామన్నారు.