Mamata Banerjee: మహిళా డాక్టర్‌పై హత్యాచారం కేసులో దోషికి జీవితఖైదు విధించడంపై మమతా బెనర్జీ అసంతృప్తి

ఈ కేసులో విచారణ ఎలా జరిపారో తమకు తెలియదని మమతా బెనర్జీ అన్నారు.

Mamata Banerjee

కోల్‌కతాలోని ఆర్జీకర్‌ ఆసుపత్రి మహిళా డాక్టర్‌పై హత్యాచారం కేసులో దోషి సంజయ్‌ రాయ్‌కి సీల్దా కోర్టు మరణశిక్ష విధించకుండా జీవితఖైదు విధించడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

ముర్షిదాబాద్ జిల్లాలో మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ… “జీవితఖైదు విధింపుపై నేను సంతృప్తి చెందడంలేదు. దోషికి మరణశిక్ష విధించాలని అందరం కలిసి డిమాండ్ చేశాం. అయితే, కోర్టు మాత్రం జీవితఖైదు విధించింది” అని అన్నారు. కోల్‌కతా పోలీసుల నుంచి దర్యాప్తును బలవంతంగా లాక్కున్నారని ఆమె చెప్పారు. ఈ కేసులో పోలీసులే విచారణ జరిపి ఉంటే దోషికి మరణశిక్ష పడేదని అన్నారు.

ఈ కేసులో విచారణ ఎలా జరిపారో తమకు తెలియదని మమతా బెనర్జీ అన్నారు. పశ్చిమ బెంగాల్ పోలీసులు విచారించిన ఇటువంటి అనేక కేసుల్లో దోషులకు మరణశిక్ష పడిందని చెప్పారు.

కాగా, గత ఏడాది ఆగస్టు 9న రాత్రి సమయంలో ఆర్జీకర్ హాస్పిటల్‌ సెమినార్‌ గదిలో మహిళా డాక్టర్‌పై హత్యాచారం జరిగింది. అప్పట్లో హైకోర్టు ఆదేశాలతో ఈ కేసును కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐ స్వీకరించిన విషయం తెలిసిందే.

ఆర్జీకర్‌ ఆసుపత్రి మహిళా డాక్టర్‌పై హత్యాచారం కేసులో దోషికి జీవితఖైదు