Robbery: పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, మాజీ స్విమ్మర్, స్విమ్మింగ్ క్వీన్ గా గుర్తింపు పొందిన బులా చౌదరి ఇంట్లో దొంగతనం జరిగింది. పలు ఈవెంట్స్ లో ఆమె సాధించిన విలువైన పతకాలను దొంగలు ఎత్తుకెళ్లారు.
అందులో గోల్డ్ మెడల్స్, మెమెంటోలు కూడా ఉన్నాయి. మొత్తంగా 150కి పైగా మెడల్స్, మెమెంటోలు అపహరించారు.
వెస్ట్ బెంగాల్ లోని హుగ్లీ జిల్లాలో బులా చౌదరి పూర్వీకుల ఇల్లు హిండ్ మోటార్ హౌస్ ఉంది. ఆ ఇంట్లోనే ఈ చోరీ జరింది. ఆమె ఈ ఇంట్లో ఉండటం లేదు. కస్బా ప్రాంతంలో నివాసం ఉంటారు. బులా చౌదరి సోదరుడు ఆ ఇంటిని చూసుకుంటూ ఉంటాడు.
తాను జీవితంలో సంపాదించుకున్న సర్వం కోల్పోయాను అంటూ బులా చౌదరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దొంగలు పతకాలతో పాటు సొమ్ము కూడా దోచుకెళ్లారని తెలిపారు.
అర్జున అవార్డ్, టెన్సింగ్ నార్కే మెడల్‌ను మాత్రమే వదిలేశారని చెప్పారు.
”కెరీర్‌లో ఎంతో కష్టపడి సంపాదించిన పతకాలను దొంగలు ఎత్తుకెళ్లారు. SAAF గేమ్స్ లో సాధించిన ఏడు స్వర్ణాలు కూడా అందులో ఉన్నాయి.
అర్జున అవార్డ్, టెన్సింగ్ నార్కే పతకాలు మాత్రం వదిలేశారు. బహుశా అవి చిన్నగా ఉండడంతో వాటిని పట్టించుకోలేదేమో.
గతంలోనూ నా ఇంట్లో చోరీలు జరిగాయి’’ అని బులా చౌదరి వాపోయారు.
”దొంగలు నా మెడల్స్ ఎందుకు ఎత్తుకెళ్లారో తెలియడం లేదు. ఆ మెడల్స్ వల్ల వాళ్లకు ఏ మాత్రం డబ్బులు రావు.
అవి నా జీవితంలో సాధించిన విలువైన ఖజానా. నా కెరీర్‌లో సాధించిన విజయాలకు గుర్తులు. ఖాళీగా ఉండటంతో దొంగలు నా ఇంటిని టార్గెట్ చేస్తున్నారు’ అని బులా చౌదరి ఎమోషన్ అయ్యారు.
కాగా, హిండ్ మోటర్ హౌస్ లో చోరీ జరగడం ఇది మూడోసారి.
బులా చౌదరి కోల్పోయిన వాటిలో 2009లో ఆమె అందుకున్న పద్మశ్రీ, రెండు దక్షిణాసియా సమాఖ్య (SAF) క్రీడలలో గెలిచిన 10 బంగారు పతకాలు ఉన్నాయి. (Robbery)
“వారికి ఏ మాత్రం విలువ కాని వాటిని తీసుకెళ్లారు. నాకు మాత్రం అవి చాలా విలువైనవి.
1979లో, నేను తొమ్మిదేళ్ల వయసులో పోటీ చేయడం మొదలుపెట్టినప్పటి నుండి, 1995లో పదవీ విరమణ చేసే వరకు, నేను సంపాదించినదంతా పతకాలే.
అవన్నీ పోయాయి” అని కన్నీటి పర్యంతం అయ్యారు బులా చౌదరి. పదేళ్ల కెరీర్ లో బులా చౌదరి అనేక పతకాలు గెలుచుకున్నారు.
‘సుందర్ బారి’ అని పిలువబడే ఆ ఇంట్లో ఇది మూడవ దొంగతనం. 2014లో, ఏడు నెలల వ్యవధిలో ఆ ఇంట్లో రెండు దొంగతనాలు జరిగాయి. నగలు, మెమెంటోలు, LED టీవీతో సహా ఎలక్ట్రానిక్ వస్తువులు దొంగిలించబడ్డాయి.
బులా చౌదరి ప్రస్తుతం కస్బాలో నివసిస్తున్నారు. చివరిసారిగా నెల క్రితం హిండ్‌మోటర్ ఇంటికి వెళ్ళారు. ఆదివారం మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి ఉంది.
శుక్రవారం ఆమె సోదరుడు డోలన్.. ఇంటిని శుభ్రం చేయడానికి తెరిచినప్పుడు షాక్ కి గురయ్యాడు.
దొంగతనం జరిగినట్లు గుర్తించాడు. పతకాలే కాదు ట్యాప్స్ కూడా దొంగలు వదల్లేదు. వాటిని కూడా ఎత్తుకెళ్లారు. దీంతో వాష్‌రూమ్‌లు నిరుపయోగంగా మారాయి.(Robbery)